ఏపీ ముఖ్యమంత్రి చాలా క్లోజ్…అదే ఆయనకు రెండోసారి మంత్రయ్యేలా చేసింది. రాష్ట్ర మంత్రి అయినప్పటికీ…నియోజవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారా ? జిల్లా ఎమ్మెల్యేలంటే…ఆ సీనియర్ మంత్రి భయపడుతున్నారా ? ఇంతకీ ఎవరా మంత్రి…? ఎంటా నియోజకవర్గం ? పొంగూరు నారాయణ…విద్యావేత్తగా దేశంలో ఎంతో ప్రసిద్ధి. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు…ఎమ్మెల్సీ పదవి ఇచ్చి….మంత్రిని చేశారు సీఎం చంద్రబాబు. కీలకమైన పురపాలక..పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలను అప్పగించారు. 2014 నుంచి 19 వరకూ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నారాయణ శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసినా …స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి విద్యా సంస్థలపై దృష్టి పెట్టిన నారాయణకు…2023లో నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి…70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో నారాయణకు మరోసారి మంత్రి పదవి లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు మళ్ళీ పురపాలక శాఖను అప్పగించారు. గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించినా…టిడిపికి చెందిన కొందరు శాసనసభ్యులు మాత్రం సహకరించడం లేదట.
నెల్లూరు నగర పాలక సంస్థ వ్యవహారాల్లో…ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డితో నారాయణకు విభేదాలు వచ్చాయి. రూరల్ పరిధిలో పనులు తన ఆధ్వర్యంలో జరగాలని శ్రీధర్ రెడ్డి భావిస్తున్నారు. కానీ నగరానికి సంబంధించి పనులను విభజించకుండా పనులు చేయిస్తున్నారు నారాయణ. దీంతో అసంతృప్తికి గురైన శ్రీధర్ రెడ్డి….మంత్రి నారాయణ నిర్వహిస్తున్న సమీక్షలకు హాజరు కావడం లేదు. జిల్లాలోని ఇతర శాసనసభ్యులకు మంత్రితో సరైన సత్సంబంధాలు లేవు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి, కందుకూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డి పాలెం, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరు పేట మునిసిపాలిటీలు…అల్లూరు నగర పంచాయతీలు ఉన్నాయి. పురపాలక శాఖ మంత్రిగా ఉన్నా…వీటి అభివృద్ధి గురించి పట్టించు కోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ..ఈ పట్టణాల్లో పర్యటించకపోవడంపై రకరకాల చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేలకు భయపడి వెళ్లడం లేదని ఒకరంటే…సత్సంబంధాలు లేకపోవడంతోనే ఆయా నియోజకవర్గాలకు వెళ్లడం లేదనే వాదనలు ఉన్నాయి. జిల్లా స్థాయి సమావేశాలు ఉన్నప్పుడు హాజరవుతున్నారే తప్పా…ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదు. కేవలం నెల్లూరు సిటీ నియోజకవర్గానికే నారాయణ పరిమితమవుతున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధి సిటీ… రూరల్ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ… ఆయన కేవలం సిటీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిపై ఫోకస్ చేసిన నారాయణ…ఇప్పుడు నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారనేది చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు… అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో రాష్ట్ర మంత్రి అయినప్పటికీ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఆయన పర్యటించడం లేదు. ఇతర నియోజకవర్గాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం తన వద్దకు వస్తే…సంబంధిత ఎమ్మెల్యే ఆమోదం తీసుకురావాలని సూచిస్తున్నారట. మంత్రికి…ఎమ్మెల్యేలకు సరైన సంబంధాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ తగ్గించేందుకు సీనియర్ నేతలు జోక్యం చేసుకోవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.