Ntv Chairman’s Desk: పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. అయితే అది ఎలా అనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక యుద్దం మొదలుపెట్టింది. కానీ కొందరు సోషల్ మీడియా దేశ భక్తులు మాత్రం పాక్ పై అణుదాడికి దిగాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇంతకూ భారత్ ఏం చేస్తే బాగుంటుంది..? అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంది..? అణ్వస్త్రాల విషయంలో దాయాదుల వైఖరేంటి..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
వ్యక్తిగత స్థాయి నుంచి దేశాల స్థాయి వరకు ప్రతీకారం తీర్చుకోవడం అనేది మానవ సహజ లక్షణం. తట్టుకోలేని ఎదురుదెబ్బ తగిలినప్పుడు, ఘోరమైన అవమానం ఎదురైనప్పుడు.. కచ్చితంగా పగ తీర్చుకోవాలని మనసు కోరుకుంటుంది. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత దేశమంతా పాకిస్తాన్ పై ఆగ్రహంతో రగిలిపోతోంది. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్ర ఘాతుకానికి.. పాక్ కు తగిన గుణపాఠం చెప్పాలనే డిమాండ్ పెరిగిపోతోంది. అయితే ఇదే ఊపులో పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని, అణ్వస్త్రాలు ప్రయోగించాలని సోషల్ మీడియా దేశభక్తులు వీరావేశపడుతున్నారు. యుద్ధం అనేది ఆవేశంతోనే, భావోద్వేగంలోనో చేసేది కాదు. యుద్ధం చేయడానికి ముందు చాలా పరిస్థితులు చూసుకోవాలి. సరైన వ్యూహరచన చేయాలి. అన్నింటికీ మించి అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదనే పరిస్థితి ఉండాలి. ఇంకా యుద్ధం లక్ష్యం కూడా కచ్చితంగా ఉండాలి. అంతే కానీ పబ్లిక్ డిమాండ్ మేరకు యుద్ధం చేయడం ఎక్కడా జరగదు. ఇక అణ్వస్త్రాల ప్రయోగించాలనే సలహా తెలిసీతెలియని తనానికి పరాకాష్ట.
అసలు అణ్వస్త్రాలు ఎప్పుడు ప్రయోగించాలి.. ఎప్పుడు వాడకూడదు అని ప్రతి అణ్వస్త్ర దేశానికి కొన్ని నిబంధనలున్నాయి. ఇవి కాకుండా ముందుగా అణ్వస్త్రం ప్రయోగించబోమని భారత్, పాక్ 1988లో నో ఫస్ట్ ట్రీటీపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం 1991 నుంచి అమల్లోకి వచ్చింది. అలాంటప్పుడు అణ్వస్తాల ప్రయోగం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. పైగా ఒక్కసారి అణుదాడి జరిగాక దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేరు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ లో హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడి దుష్ఫలితాన్ని అక్కడి ప్రజలు ఇంకా అనుభవిస్తున్నారు. అణుబాంబు దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే హిరోషిమా నగరంలో 70 వేల మందికి పైగా మరణించగా… అణుధూళి వల్ల మరో 90 వేల నుంచి లక్షా 40 వేల మంది మరణించినట్లు గణాంకాలు చెపుతున్నాయి. నాటి దాడికి హిరోషిమాలోని భవనాల్లో సుమారు 69 శాతం నేలమట్టమయ్యాయి. అంతేకాదు 1942లో 4 లక్షల 19 వేల 182గా ఉన్న నగర జనాభా అణు దాడితో లక్ష 37 వేల 197కు చేరిందంటే దాడి ప్రభావం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.ఆ తర్వాత మళ్లీ అణుదాడి ఎక్కడా జరగలేదు. ఇప్పుడు అత్యాధునిక అణ్వాయుధాలు వచ్చిన తరుణంలో.. అణు దాడి జరిగితే టార్గెట్ చేసిన దేశంతో పాటు ప్రయోగించిన దేశానికీ నష్టం తప్పదనే అంచనాలు లేకపోలేదు.
భారత దేశం ఏ రకంగానూ పాకిస్థాన్‌పై నేరుగా అణ్వాయుధాలు ప్రయోగించలేదు. అలాగే పాకిస్థాన్ కూడా భారత్‌పై కూడా నేరుగా అణ్వస్త్రాలు వేసేయలేదు. అణ్వస్త్ర ప్రయోగం అనేది రెండు దేశాలకు చివరి అవకాశం మాత్రమే. ఒకరినొకరు సర్వనాశనం చేసుకోవాలని అనుకుంటేనే అణ్వస్త్ర ప్రయోగం చేసుకుంటారు. నిజానికి భారత్ పాకిస్థాన్ ఇద్దరికీ సలహాదారు పాత్ర పోషిస్తున్న అమెరికా జోక్యం అలాగే సలహా లేకుండా అసలు అణ్వస్త్ర ప్రయోగం సాధ్యం కాదు. అసలు యుద్దోన్మాదంతో ఊగిపోవడమే తప్పని చెబుతుంటే.. ఏకంగా అణ్వస్త్రాలు ఉన్నదెందుకు.. తీసి వేసేయండి అంటూ సోషల్ మీడియాలో ఉచిత సలహాలివ్వడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా అణ్వస్త్రాలు ఉన్న మాట నిజం. దాయాదులు పోటాపోటీగా అణ్వస్త్ర ప్రయోగాలు చేసుకుని.. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఇప్పటికే అణ్వస్త్రాల్ని భారత్ లో వ్యూహాత్మక లక్ష్యాల్ని ఛేదించటానికి వీలుగా మోహరించామని పాక్ చెబుతోంది. పరిస్థితి చేయిదాటితే.. అణుదాడికి కూడా దిగుతామని పాక్ బీరాలు పలుకుతోంది. కానీ దాయాది ఆ పని చేస్తే భారత్ కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. పాక్ చిన్న అణ్వస్త్రం ప్రయోగించినా.. భారీగా ప్రతిదాడి చేస్తామని భారత్ కొన్నాళ్ల క్రితమే హెచ్చరించింది. అవసరమైత తమ అణు విధానాన్ని మార్చుకుంటామని కూడా తేల్చిచెప్పింది. ఇవన్నీ తెలిసి కూడా పాక్ భారత్ ను ఉద్దేశపూర్వకంగా కవ్విస్తోంది. అయితే పాక్ సంగతి తెలిసిన భారత్.. ఆ దేశం కుట్రల్ని తిప్పికొడుతోంది. ఇప్పటివరకు భారత్, పాక్ మధ్య నాలుగుసార్లు యుద్ధం జరిగింది. అణ్వస్త్రాలు లేక ముందే కాదు.. వచ్చిన తర్వాత కూడా యుద్ధాలు జరిగాయి. అయినా సరే సంప్రదాయ యుద్ధానికే పరిమితమైన రెండు దేశాలూ ఎక్కడా అణ్వస్త్రాల ప్రసక్తి లేదు. అలాంటిది ఇప్పుడు సమయం, సందర్భం లేకుండా పాక్ అణ్వస్త్రాల పేరు చెప్పి బెదిరింపులకు దిగటం హాస్యాస్పదమే తప్ప మరొకటి కాదు. పాక్ ఏం చేసినా ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసని భారత్ చెబుతోంది. భారత్ ఇప్పటికే సైలంట్ గా తన పని తాను చేసుకుపోతోంది. పాక్ ప్రకటనలకు పెద్దగా విలువ ఇవ్వకుండా.. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆచరణ సాధ్యమైన వ్యూహాలను బేరీజు వేసుకుంటోంది.
పహల్గాం ఉగ్రదాడి జరిగినందుకు మన దేశంలో అందరికీ బాధగానే ఉంది. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. కానీ అందుకోసం అన్నిరకాలుగా ఆలోచించాలి. ఆవేశపడి ఏదోకటి చేసేయడం మంచిది కాదు. ఈ కోణంలోనే భారత్ వ్యూహాత్మక యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం కంటే ఎక్కువ నష్టం చేసే పని చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బెటరనే అభిప్రాయాలు వస్తున్నాయి. భారత్ యుద్ధానికి దిగుతుందని ఊహించిన పాక్.. ఈ చర్యల్ని ఏ మాత్రం ఊహించలేదు. దీంతో భారత్ వేసే ప్రతి అడుక్కీ.. దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది. సింధూ జలాల ఒప్పందం నిలిపేసినా, ద్వైపాక్షిక వాణిజ్యంపై నిషేధం విధించినా, పాక్ విమానాలకు గగనతలం మూసేసినా.. పాక్ ఓడలు మన పోర్టులకు రాకూడదని చెప్పినా.. ఇవన్నీ వ్యూహాత్మక యుద్ధంలో భాగమే. ఇలాంటి చర్యలతో పాక్ ను అష్టదిగ్బంధనం చేసి.. చావుదెబ్బ కొట్టాలనేది భారత్ యోచనగా ఉంది. దీంతో పాటు ఆర్థిక దిగ్బంధం కూడా మొదలైంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాక్ ను గ్రే లిస్ట్ లో పెట్టేలా చూడటం, ఐఎంఎఫ్ నుంచి అప్పు రాకుండా అడ్డుకోవడానికి భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ చర్యలన్నీ ఓ కొలిక్కి వస్తే.. పాక్ మరింత నిర్వీర్యం కావడం ఖాయం.
భారత్ ఇన్నేళ్లుగా ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ, సింధూ నది నీటిని పాకిస్తాన్‌కు సముచితంగా వదిలిస్తూనే వచ్చింది. అయితే పాకిస్తాన్ మాత్రం ప్రతిసారీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ, జలవనరులను కూడా రాజకీయ ఆయుధంగా వాడేందుకు ప్రయత్నిస్తోన్న తీరు కొనసాగిస్తోంది. పైగా, ఇండియా నిర్మిస్తున్న హైడ్రో ప్రాజెక్టులపై తరచూ అభ్యంతరాలు తెలుపుతూ, వాటిని అంతర్జాతీయ న్యాయస్థానాల్లోకి లాగే ప్రయత్నాలు కూడా చేసింది. కానీ తన బకాయిలను తీర్చకపోయినా, ఉగ్రవాదానికి అండగా ఉన్నా, భారత్ మాత్రం నీటిపై ఉన్న ఒప్పందాన్ని గౌరవిస్తూ వచ్చింది. ఇప్పుడు పహల్గాం దాడి జరిగిన తరుణంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయాలన్న నిర్ణయం మాత్రం పూర్తిగా భిన్నమైనది. ఇది కేవలం నీటి నియంత్రణ సమస్యే కాదు.. ఇది ఒక వ్యూహాత్మక చర్య. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ మీద పడే దెబ్బ అత్యంత తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉంది. సింధు బేసిన్ మీదే ఆధారపడే వ్యవసాయ రంగం దిగుబడి తగ్గినా, తాగునీటి కొరత ఏర్పడినా, హైడ్రోపవర్ ఉత్పత్తి క్షీణించినా..వాటన్నింటికన్నా ముందుగా పాక్ ఎదుర్కొనే దెబ్బ ఆహార భద్రత పై ఉంటుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ, ఆర్ధిక దివాలా పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కి ఇది మరింత ఉత్పాతం తెచ్చే పరిణామం అవుతుంది. మరోవైపు దేశంలో మిలిటరీ వ్యయాలు పెరిగినప్పటికీ, ప్రజల ప్రాథమిక అవసరాల్ని తీర్చలేని పరిస్థితి నెలకొనడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. రాజకీయంగా అస్థిరత పెరిగితే, మిలిటరీ వ్యవస్థే పాలన చేపట్టే అవకాశాలు కూడానే ఉన్నాయి. ఇది మొత్తంగా పాక్‌ను అంతర్గతంగా కుంగదీసే పరిణామాలకు దారితీయవచ్చు.
భారత్ ఇంతవరకు సైనిక చర్య అనే పదం వాడలేదు. అలాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. అటు సైన్యం కూడా రెగ్యులర్ గా జరిగే విన్యాసాలే చేస్తున్నామని చెబుతోంది. అయినా సరే దాయాది మాత్రం ఉలిక్కిపడుతోంది. భారత్ తమపై దాడికి దిగుతుందని ఎలుగెత్తి చెబుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలను సాయం చేయాలని అభ్యర్థించింది. కానీ ఎవ్వరూ పాకిస్తాన్ కు భరోసా ఇవ్వలేదు. దీంతో ఆ దేశానికి భయం మరింతగా పెరిగిపోతోంది. దీనికి తోడు భారత్ లో జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశాలకు, తీసుకుంటున్న చర్యలకు పొంతన కనిపించడం లేదని పాక్ మథనపడుతోంది. మిలిటరీ చర్య ఉండదని పాక్ కు నమ్మకం కుదరటం లేదు. ఎందుకంటే భారత్ త్రివిధ దళాధిపతులు రెగ్యులర్ గా ప్రధాని మోడీని కలుస్తున్నారు. సుదీర్ఘ సమావేశాలు జరుగుతున్నాయి. మిలటరీ యాక్షన్ లేకపోతే.. ఇన్ని సమావేశాలు ఎందుకుంటాయని పాక్ బుర్ర బద్దలు కొట్టుకుంటోంది. ఈలోగా భారత్ చేస్తున్న వ్యూహాత్మక యుద్ధం పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. దీంతో ఏ యుద్ధం గురించి ఆలోచించాలో అర్థం కాని అమోయమంలో ఉంది పాకిస్తాన్. పాకిస్తాన్ పై ఇలాగే ఒత్తిడి పెంచి కాళ్లబేరానికి వచ్చేలా చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అటు సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపులకు బీఎస్ఎఫ్ దీటుగా జవాబిస్తోంది. అరేబియా సముద్రంలో చీమ చిటుక్కుమన్నా పాక్ పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడుతోంది. యుద్ధం కంటే వ్యూహాత్మక యుద్ధమే పాక్ ను ఎక్కువ దెబ్బ కొడుతోందనే వాదన వినిపిస్తోంది.