NLG FAKE BABA ARREST: మంత్రాలకు చింతకాయలు రాలవు.. అనేది సామెత. చింతకాయలు కాదు కదా.. ఆకులు కూడా రాలవు.. అనేది వాటిపై అవగాహన ఉన్నవారు చెబుతారు. కానీ ఇప్పటికీ మంత్రాలు, క్షుద్రపూజల నెపంతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. అలాంటి కంత్రీ మంత్రగాన్ని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి డబ్బు, బంగారం దోచుకుంటున్న అలాంటి నిందితుడు చివరికి కటకటాలపాయ్యాడు. అమాయక ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న దొంగబాబాను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన కోన వినోద్ కుమార్ గత కొంత కాలంగా ఆయుర్వేద వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. అప్పటికే జల్సలకు అలవాటుపడిన వినోద్ కుమార్‌కు ఆయుర్వేద వైద్యం చేయడం ద్వారా వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపొవడంలేదు. ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో తనకు వచ్చిన వైద్యంలో మార్పులు చేశాడు. బాబా అవతారం ఎత్తాడు నాటు వైద్యం, మంత్రాలతో అనారోగ్యాన్ని తగ్గిస్తానని మాయమాటలతో ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు.
అనారోగ్యంతో బాధపడే పిల్లల కాళ్లకు కడియాలు వేసి… పూజలు చేయడం ప్రారంభించాడు వినోద్ కుమార్. ఈ క్రమంలోనే మిర్యాలగూడలోని శాంతినగర్‌కు చెందిన దంపతులు అడావత్ శిరీష, గోవింద్‌లు తమ బంధువుల సూచన మేరకు కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడతున్న తమ ఇద్దరి పిల్లలను వినోద్ కుమార్ వద్దకు తీసుకువెళ్లి కడియాలు వేయించారు. బాబా అవతారం ఎత్తిన వినోద్ కుమార్ శిరీష, గోవింద్ దంపతుల ఇంటికి అప్పడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో వారి అమాయకత్వాన్ని పసిగట్టిన నిందితుడు… ఓ ఫైన్ డే.. శిరీష భర్త గోవింద్‌కు ప్రాణహాని ఉందని తేల్చిచెప్పాడు. గండం గట్టేక్కాలంటే దేవతకు ముడుపులు కట్టాల్సిందేనని…. ప్రత్యేక పూజలు చేసి దేవతకు ముడుపులు చెల్లిస్తే ప్రాణహాని తప్పుతుందని నమ్మబలికాడు. ముడుపు వస్త్రంలో 6 తులాల బంగారం పెట్టాలని.. ప్రత్యేక పూజలు చేసినందుకు 13 వేల 2 వందలు తనకు ఇస్తే చాలని ఆ కుటుంబాలన్ని నమ్మించాడు.
పాపం.. ఆ బాబా మాటలు నమ్మిన దంపతులు… ఆయన చెప్పినట్లు చేసేందుకు సిద్దం అయ్యారు. బాబా చెప్పినట్లు 6 తులాల బంగారాన్ని ఓ వస్త్రంలో ముడుపు కట్టారు. ఇంకేముంది రంగంలోకి దిగిన బాబా వినోద్ కుమార్.. శిరీష, గోవింద్ ఇంట్లో తన స్టైల్లో ప్రత్యేక పూజలు చేశాడు. పూజ పూర్తి అయ్యే వరకు కళ్లు తెరవద్దని… కళ్లు తెరిస్తే పూజా ఫలితం దక్కదని హుకుం జారీ చేశాడు. కట్టిన ముడుపు 41 రోజుల వరకు తెరవద్దని సూచించాడు. 41 రోజుల తరువాత ముడుపు విప్పిన ఆ కుటుంబం షాకైంది. ఆ ముడుపులో బంగారం లేదు… మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు శిరిషా, గొవింద్ మిర్యాలగూడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టడంతో నకిలీ బాబా ఘరానా మోసం బయటపడింది. పూజ జరుగుతుంగా కళ్లు తెవద్దని… తెరిస్తే పూజ ఫలం దక్కదని షరతు విధించిన బాబా వినోద్ కుమార్.. బాధితులు కళ్లు మూసుకుని పూజలో ఉండగానే పథకం ప్రకారం సినీ ఫక్కీలో ముడుపును మాయం చేసి… దాని స్థానంలో ఇతర వస్తువులతో కట్టిన ముడుపు వస్త్రాన్ని పూజగదిలో పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
గోవింద్ ఆయుష్షు పెంచేందుకు ప్రత్యేక పూజలు చేసిన బాబా వినోద్ కుమార్‌కు.. బాధితులు ఫోన్ పే ద్వారా 13వేల 2వందలు చెల్లించారు. ఆ నంబర్ ఆధారంగా దొంగబాబా ఆటకట్టించారు మిర్యాలగూడ పోలీసులు.. నిందితుడి వద్ద నుంచి 3 తులాల బంగారం, ఒక సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు సరిపడా డబ్బు చేతిలో లేకపోవడంతో వినోద్ కుమార్ తాంత్రిక బాబా అవతారం ఎత్తాడని… గత కొంతకాలంగా పథకం ప్రకారం క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేసి బంగారం, నగదు కాజేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు క్షుద్ర పూజల పేరిట కాజేసిన బంగారాన్ని కుదువ పెట్టి గోల్డ్ లోన్ తీసుకొని వచ్చిన డబ్బును తన జల్సాలకు వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల వినోద్ కుమార్ ఇటువంటి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.




