Nitesh Rane: మహారాష్ట్రలో జాతీయ విద్య విధానం(ఎన్ఈపీ) అమలులో భాగంగా మరాఠీ, ఇంగ్లీష్‌తో పాటు హిందీని తప్పనిసరి చేయడాన్ని రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదమే, ఇప్పుడు మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలకు కారణమవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ, రాజ్ ఠాక్రే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘ ఉద్ధవ్ ఠాక్రేతో నాకు ఉన్న సమస్యలు చిన్నవి, మహారాష్ట్ర ప్రయోజనాలే పెద్దవి. నేను మహారాష్ట్ర కోసం ఉద్ధవ్‌తో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, ఉద్ధవ్ తనతో కలుస్తారనేది పెద్ద ప్రశ్న’’ అని అన్నారు.
Read Also: Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అత్యధిక హాఫ్ సెంచరీలు..
అయితే, ఈ వ్యవహారాలపై బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాజ్ ఠాక్రేపై స్పందించేందుకు ఉద్ధవ్ ఠాక్రే ముందుగా ఆయన భార్య రష్మీ ఠాక్రే అనుమతి కోరారా.? అని ప్రశ్నించారు. రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీతో చేతులు కలిపేందుకు ఏదైనా చర్య తీసుకునే ముందు రష్మీ ఠాక్రేని అనుమతి అడిగారా..?, అలాంటి నిర్ణయాల్లో ఆమె అభిప్రాయమే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని రాణే అన్నారు. ఇద్దరు బంధువులు అయినప్పటికీ, రాజ్ ఠాక్రే శివసేన నుంచి నిష్క్రమించడంలో రష్మీ ఠాక్రేనే కీలక పాత్ర పోషించారని రాణే ఆరోపించారు. మహారాష్ట్రలో ఎలాంటి కొత్త పొత్తులు వచ్చినప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు.