లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన విషయాలు బయట పెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి, శారీరకంగా హింసించారని NHRC దర్యాప్తు బృందం నిర్ధారించింది. 2024 నవంబర్‌లో ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజా విచారణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు.. అధికారులపై దాడి చేశారని కేసు నమోదు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌లో లగచర్ల నివాసితులలో కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి, శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు బృందం వెల్లడించింది.
నిరసన జరిగినప్పుడు సంఘటన స్థలంలో లేని అనేక మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు, ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురిచేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రిపూట అరెస్టు చేయబడిన గ్రామస్థులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి, హింసించి.. మేజిస్ట్రేట్ ముందు హింస గురించి చెప్పొద్దని బెదిరించారని రిపోర్ట్ లో తేల్చి చెప్పింది.
Also Read:Tamil Nadu Governor: వీసీల సదస్సు ఏర్పాటు చేయాలన్న తమిళనాడు గవర్నర్.. మండిపడిన కాంగ్రెస్, సీపీఎం
రాజకీయ కక్షతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకుని ఘటనతో సంబంధం లేకపోయినా పోలీసులు వారిని అరెస్ట్ చేసి హింసించారని కూడా కమిషన్ పేర్కొన్నది. ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపైన కూడా కేసు నమోదు చేయలేదని అరెస్టులు కూడా జరగలేదని అని నివేదికలో వెల్లడించింది. ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా కేసులు నమోదు చేశారని రిపోర్టులో NHRC దర్యాప్తు బృందం వెల్లడించింది.