ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధీనంలో ఉన్న వేల ఎకరాల భూములకు సంబంధించి ఏళ్ల తరబడి నెలకొన్న మ్యుటేషన్ సమస్యలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 51,603 ఎకరాల భూములను తక్షణమే రెవెన్యూ రికార్డుల్లో (వెబ్ ల్యాండ్) ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం..
చాలా కాలంగా ఏపీఐఐసీ వద్ద ఉన్న భూములు రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా నమోదు కాకపోవడం వల్ల, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు పొందడంలోనూ.. భూ బదలాయింపు ప్రక్రియలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గమనించిన ప్రభుత్వం, పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ఈ కీలక అడుగు వేసింది.
Also Read:Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ..
22A జాబితా నుంచి మినహాయింపు..
మరో ప్రధానమైన అంశం ఏమిటంటే.. ఏపీఐఐసీ పరిధిలో ఉన్న సుమారు 70 వేల ఎకరాల ప్రభుత్వ భూములను నిషేధిత భూముల జాబితా (22A) నుండి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భూముల వినియోగంపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి.
ఈ ప్రక్రియను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అమలు విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. భూముల మ్యుటేషన్ , 22A తొలగింపు ప్రక్రియను కేవలం 15 రోజుల్లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ మార్పులు చేయడం ద్వారా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.




