Kolkata Knight Riders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026కు ముందు, మూడుసార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు సమస్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హర్షిత్ రాణా ఈ టోర్నమెంట్ మొత్తానికి దూరమవ్వగా, ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ఆకాశ్ దీప్ సైతం ఈ సీజన్‌కు దూరం కానున్నాడు. గతేడాది అబుదాబిలో జరిగిన మినీ వేలంలో కేకేఆర్ జట్టు ఆకాశ్‌ను రూ. 1 కోటికి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆకాశ్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టు బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బగా మారనుంది. వాస్తవానికి.. ఆకాశ్ దీప్‌కు ముందే గాయమైంది. బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ సెమీఫైనల్ ఆడుతున్నప్పుడే వెన్నునొప్పి (Stress reaction) బారిన పడ్డాడు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Iran Nowruz: 1980ల ఇరాన్-ఇరాక్ వార్ తర్వాత మొదటిసారిగా.. యుద్ధం మధ్య నౌరూజ్ జరుపుకున్న ఇరాన్
మార్చి 18న కోల్‌కతాలో ప్రారంభమైన కేకేఆర్ ప్రీ-సీజన్ క్యాంప్‌కు గానీ, శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు గానీ ఆకాశ్ హాజరు కాలేదు. మరోవైపు.. శ్రీలంక పేసర్ మతీషా పతిరానా విషయంలోనూ ఇంత వరకు క్లారిటీ రాలేదు. రాణా భుజం గాయంతో బాధపడుతున్నాడు. ఈ సీజన్‌లో రాణా ఆడతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురు దెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్ బౌలింగ్ విభాగంలో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ, కార్తీక్ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇక ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు మేనేజ్మెంట్ కసరత్తు షురూ చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో నవదీప్ సైనీ, ఆకాష్ మధ్వాల్, సందీప్ వారియర్ వంటి ఆటగాళ్లతో ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ నెల 29 ముంబైతో కేకేఆర్ తొలి మ్యాచ్‌ను ఎదుర్కోనుంది. అంతలోపు మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.




