దేశం, ధర్మం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్ పేట్ లోని ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు. ప్రధాని మోడీ కూడా గతంలో ఈ గురుద్వారాను సందర్శించి తన భక్తిని చాటుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
READ MORE: Srinivasa Varma: నోరు మూసుకుని ఇంట్లో కూర్చో.. మాజీ మంత్రికి కేంద్ర మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
కాగా.. అమీర్‌పేటలోని గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో వైశాఖీ (బైశాఖీ) ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో తొలిరోజు అమృత్ సంచార్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సిక్కు మత గురువులు(రాగి జత్తాస్) గుర్భాణీ కీర్తనలు ఆలపిస్తూ గురు గ్రంథాన్ని పఠిస్తూ అమృత్‌పాన్(పవిత్ర పానీయం)ను తయారు చేశారు. మత సంప్రదాయాలను పాటిస్తూ ఈ మతాన్ని అధికారికంగా అంగీకరించేందుకు ముందుకు వచ్చిన వారికి పానీయాన్ని అందజేశారు. హోలీ బాప్టిజంగా పేర్కొనే ఈ కార్యక్రమం ద్వారా సిక్కు యువత, పిల్లలు, మహిళలు అమృత పానీయాన్ని స్వీకరించారు. ఈ పానీయాన్ని తీసుకున్నవారు జీవితాంతం సిక్కు మత నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుందని గురువులు తెలిపారు. గురుద్వారాకు వచ్చిన భక్తులు, బాటసారులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గురుద్వారా సభ్యులు స్థానికులు షర్బత్, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. నేడు కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.