ఐపీఎల్ ప్రాంచైజ్ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఓనర్ సంజీవ్ గోయెంకా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో గెలిస్తే ఫర్వాలేదు కానీ.. ఓడితే మాత్రం వెంటనే మైదానంలోకి వచ్చేస్తారు. కెప్టెన్‌ను అందరి ముందూ మందలిస్తారు. కోచ్‌లు ఉన్నా సరే డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లపై మండిపడుతుంటారు. ఈ చర్యల కారణంగానే ఎల్‌ఎస్‌జీని కేఎల్ రాహుల్ వదిలివెళ్లాడు. ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ కెప్టెన్ జట్టును వీడినా.. సంజీవ్ గోయెంకా తీరులో మార్పు మాత్రం రావడం లేదు.
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓ విజయం మాత్రమే సాధించింది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇచ్చిన ఎల్‌ఎస్‌జీ.. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. అన్ని విభాగాల్లో తేలిపోయిన లక్నో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా.. కెప్టెన్ రిషభ్ పంత్‌తో మాట్లాడారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లో ‘కేఎల్ రాహుల్ – సంజీవ్ గోయెంకా’ ఎపిసోడ్ రీక్రియేట్ అయినట్లు అనిపిస్తోందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ రిషబ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా చర్చించే వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. సంజీవ్ వైఖరిపై ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘సంజీవ్ గోయెంకా.. ఈ అలవాటు మంచిది కాదయ్య’, ‘ఇతర ఫ్రాంచైజీల ఓనర్లు ఎవరూ ఇలా ప్రవర్తించడం లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘కెప్టెన్‌కు స్వేచ్ఛ ఇస్తేనే ఫలితాలు సానుకూలంగా వస్తాయి’, ‘ఫలితంపై కెప్టెన్‌తో మాట్లాడాల్సిన అవసరం లేదు, అందుకోసం కోచ్‌లు ఉన్నారు’ అంటూ సూచనలు ఇస్తున్నారు.