Indus Water Treaty: దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. మంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.
ఈ మేరకు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తన చర్యల్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ‘‘ కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. పాక్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. వాఘా -అట్టారీ బోర్డర్‌ని పూర్తిగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులకు వీసాలు రద్దు చేసింది.
సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్‌కి గతంలో చాలా సార్లు భారత్ అవకాశం ఇచ్చింది. సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని సింధు నది జలాల జోలికి వెళ్లలేదు. అయితే, గతంలో ఒకసారి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అంటూ ఈ ఒప్పందం గురించి మాట్లాడారు. తాజాగా, పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ చర్య వల్ల పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం. సింధు నది జలాలపైనే పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలు ఆధారపడి ఉన్నాయి.
Read Also: Pahalgam terror attack: పాక్‌పై ప్రతీకారం.. “సింధు జలాల ఒప్పందం” రద్దు, వాఘా మూసివేత..
ఏమిటీ ఒప్పందం..?
సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లపై, పాకిస్తాన్‌కి పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. ఈ ఒప్పందం వల్ల 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది.
పలు సందర్భాల్లో ఈ ఒప్పందం వివాదాస్పదమైంది. ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది.
ఇదే జరిగితే పాక్ ఎడారి:
ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశానికి సింధు నదీ జలాలే ప్రధాన వనరు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ దేశంలో ఈ నదీ జలాలు అత్యంత కీలకం. అయితే, ఈ నదీ జలాలను కేవలం పంజాబ్ మాత్రమే సమర్థంగా వినియోగించుకుంటోంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఒక వేళ భారత్ నుంచి వెళ్లే ఈ నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే, పాకిస్తాన్ ఏడారిగా మారడం ఖాయం. పలు సందర్భాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేసినా, భారత్‌పై యుద్ధానికి తెగబడిని కూడా మన దేశం ఎప్పుడూ ఈ నది జలాల విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ, ప్రస్తుతం మోడీ సర్కార్ ఉగ్రవాదంపై పాక్ తీరను ఉపేక్షించలేమని ఒప్పందాన్ని రద్దు చేసింది.