Indian Airlines: పహల్గామ్ ఉగ్ర దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా ఇప్పటికే దౌత్య చర్యల్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు, పాకిస్థానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలను ప్రకటించింది. అయితే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్‌తో వాణిజ్యం రద్దు చేయడంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసినట్లు ప్రకటించింది.
అయితే, ప్రస్తుతం పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత ఫలితంగా భారత విమానయాన సంస్థలపై అధిక భారం పడనుంది. మిడిల్ ఈస్ట్, యూరప్, కెనడా, అమెరికా వంటి వెస్ట్రన్ దేశాలకు వెళ్లాలంటే ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి ఉంటుంది. గతంలో 2019లో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో కూడా పాకిస్తాన్ భారత విమానాలకు తన గగనతలాన్ని నిరాకరించింది. ఆ సమయంలో భారత విమానయాన సంస్థలు రూ. 700 కోట్లు నష్టపోయాయి.
Read Also: Jammu Kashmir: ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్..
పాక్ నిర్ణయం మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా, యూరప్, యూకే, అమెరికా, కెనడా వంటి దేశాలకు వెళ్లే భారతీయ విమానయాన సంస్థలపై ప్రభావం చూపిస్తుంది. అయితే, ఆయా దేశాల నుంచి భారత్‌కి వచ్చే విదేశీ విమానయాన సంస్థలపై ఎలాంటి ప్రభావం ఉండదు. విదేశీ విమానాలు పాక్ ఎయిర్‌స్పేస్ ఉపయోగించుకుంటూ భారత్‌లోకి రావచ్చు. ప్రస్తుతం ఉత్తర భారతదేశ నగరాల నుంచి వెళ్లే విమానాలను గుజరాత్, మహారాష్ట్ర మీదుగా దారి మళ్లించి, యూరప్, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు నడుపుతున్నారు.
2019 బాలాకోట్ దాడుల తర్వాత, పాకిస్తాన్ తన ఎయిర్‌స్పేస్‌ని నిరాకరించడంతో ఎక్కువ ఎయిర్ ఇండియా ప్రభావితమైంది. ప్రస్తుతం మనదేశంలో ఎయిర్ ఇండియా ఎక్కువగా సుదూర ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది. ఆ సమయంలో విమానాల ప్రయాణ సమయం 70-80 నిమిషాలు పెరిగింది. ఢిల్లీ నుండి చికాగోకు ఎయిర్ ఇండియా విమానాలు ఇంధనం నింపుకోవడానికి యూరప్‌లో ఆగాల్సి వచ్చింది. ఇంకా, ఢిల్లీ నుండి ఇస్తాంబుల్‌కు వెళ్లే ఇండిగో విమానం దోహాలో ఇంధనం నింపుకోవడానికి స్టాప్ చేయాల్సి వచ్చింది.