First Hydrogen Fuel Cell Train: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలోని జింద్ నుంచి భారత్ తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రారంభించారు. జింద్–సోనిపట్ మధ్య నడిచే ఈ రైలు దేశంలో పర్యావరణహిత రైలు రవాణాకు నాంది పలికింది. ఇదే సందర్భంగా హర్యానాలో రూ.14,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
భారత్ తొలి హైడ్రోజన్ రైలు:
జింద్ నుంచి సోనిపట్ వరకు సుమారు 90 కి.మీ. దూరాన్ని రెండు గంటల్లో ఈ హైడ్రోజన్ రైలు పూర్తి చేస్తుంది. 10 బోగీలతో రూపొందిన ఈ రైలుకు 3,200hp హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ అమర్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ రైలు హైడ్రోజన్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని నడుస్తుంది. డీజిల్ రైళ్లతో పోలిస్తే కాలుష్యం లేకుండా పనిచేస్తూ నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ ప్రాజెక్టుతో హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.
రూ.14,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు:
హైడ్రోజన్ రైలుతో పాటు హర్యానాలో రహదారులు, రైల్వే, వైద్య రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధానంగా 157.92 కి.మీ. ఢిల్లీ–అమృత్సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీలు 1 నుంచి 5 వరకు)ను దేశానికి అంకితం చేశారు. సుమారు రూ.9,680 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఢిల్లీ నుంచి కత్రా ప్రయాణ సమయం 14 గంటల నుంచి 6 గంటలకు, ఢిల్లీ నుంచి అమృత్సర్ ప్రయాణ సమయం 4 గంటలకు తగ్గనుంది. అలాగే అంబాలా–కాలా అంబ్ హైవే, జింద్–గోహానా గ్రీన్‌ఫీల్డ్ హైవేలను ప్రారంభించారు. హన్సీ–బర్వాలా బ్రౌన్‌ఫీల్డ్ హైవేకు శంకుస్థాపన చేశారు.
వైద్య, రైల్వే, సాంస్కృతిక రంగాలకు ఊతం:
కురుక్షేత్రలో నిర్మించిన ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ ను ప్రధాని ప్రారంభించారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రైల్వే కార్యకలాపాలు మరింత సులభం కానున్నాయి. అదే విధంగా భివానీలో పండిట్ నేకీ రామ్ శర్మ ప్రభుత్వ వైద్య కళాశాల, మహర్షి చ్యవన్ మెడికల్ కాలేజ్, నార్నౌల్‌లో రావు తులారామ్ ఆస్పత్రిలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో వైద్య సేవలు, వైద్య విద్య మరింత బలోపేతం కానున్నాయి. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియం నిర్మాణానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో సిక్కు గురువుల బోధనలు, సిక్కు మత చరిత్ర, భారత నాగరికతకు సిక్కుల సేవలను ఆధునిక సాంకేతికతతో ప్రదర్శించనున్నారు.




