హైదరాబాద్ లో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. బలమైన ఈదురు గాలులు వీస్తూ బీభత్సం సృష్టించాయి. కారుమబ్బులు ఆవరించి కుండపోత వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో వర్షంధాటికి చారిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.
Also Read:Off The Record: గుమ్మనూరు బ్రదర్స్ మధ్య విభేదాలు..? ఆలూరులో అసలేం జరుగుతోంది..?
నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు దంచికొట్టాడు. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్.. సచివాలయం.. ఆబిడ్స్.. నాంపల్లి ..పటాన్ చెరువు, శేర్లింగంపల్లి ..సికింద్రాబాద్లలో భారీ వర్షం కురిసింది. భారీగా కురిసిన వానతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.