టీమిండియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ‘నిన్ను హతమారుస్తాం’ అంటూ ఐసిస్ కశ్మీర్ నుంచి గౌతీకి బెదిరింపులు వచ్చాయి. ‘ఐ కిల్ యూ’ అంటూ తనకు ఈ-మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. గంభీర్ ఫిర్యాదు మేరకు రాజీందర్‌నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం గంభీర్ కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఐ కిల్ యూ అంటూ తనకు రెండు ఈ-మెయిల్స్ వచ్చినట్లు గౌతమ్ గంభీర్ బుధవారం సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను గౌతీ కోరారు. గంభీర్ ఫిర్యాదు మేరకు ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?, ఎవరు పంపారు? అనే దానిపై సైబర్ సెల్ విచారణ చేపట్టింది. ఐసిస్ కశ్మీర్ నుంచి ఈ హత్యా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పహల్గాం ఉగ్ర దాడిపై రియాక్ట్ అయినందుకే గంభీర్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Jasprit Bumrah: ‘ట్రిపుల్ సెంచరీ’ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. మొదటి బౌలర్‌గా..!
మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 30 మందికి పైగా మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఉగ్ర దాడిపై బుధవారం సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి కోసం అందరం ప్రార్థిద్దాం. ఇందుకు బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఉగ్ర దాడిని భారత్ తిప్పికొడుతుంది’ అని గౌతీ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే గంభీర్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి.