దశాబ్దాలుగా క్యాన్సర్‌పై పోరాటంలో నిమగ్నమైన ఒక వైద్యుడిగా, నేను ఈ వ్యాధి కలిగించే వినాశనాన్ని, ఆధునిక వైద్యం సాధిస్తున్న అద్భుతాలను దగ్గర నుండి చూశాను. నేడు నేను ఎంతో గర్వంతో, ఆశాభావంతో ఉన్నాను. 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్తంగా ఉచిత ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్య చరిత్రలో ఒక మైలురాయి. ఇది కేవలం ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదు; కోట్ల మంది భారతీయ మహిళల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడే దిశగా పడిన ఒక గొప్ప అడుగు.
భారతదేశంలో మహిళలను పీడిస్తున్న రెండో అత్యంత సాధారణ క్యాన్సర్ ‘గర్భాశయ క్యాన్సర్’ (Cervical Cancer). ప్రతి ఏడాది దాదాపు 80,000 మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతుండగా, 42,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, వీటిలో 80% కంటే ఎక్కువ కేసులు ‘హై-రిస్క్ హెచ్‌పివి’ (ముఖ్యంగా స్ట్రెయిన్స్ 16, 18) ఇన్ఫెక్షన్ల వల్ల వస్తున్నాయి. ఈ వైరస్‌ను వ్యాక్సిన్ ద్వారా అడ్డుకోవడం అంటే, సమస్య వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందే దాన్ని నిర్మూలించడం. ఈ వ్యాక్సినేషన్ ద్వారా భారత్ ‘రియాక్టివ్ ట్రీట్మెంట్’ నుండి ‘ప్రోయాక్టివ్ ఎలిమినేషన్’ (వ్యాధి రాకుండా ముందే తొలగించడం) దిశగా మారుతోంది.
ఏడాదికి దాదాపు 1.2 కోట్ల మంది బాలికలకు టీకాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఎంతో ప్రశంసనీయం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ‘గార్డాసిల్’ (Gardasil) వ్యాక్సిన్‌ను పూర్తిగా ఉచితంగా అందించడం ద్వారా ‘ఖరీదు’ అనే అతిపెద్ద అడ్డంకిని ప్రభుత్వం తొలగించింది. నిర్దేశిత రోజల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం , ‘U-WIN’ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పర్యవేక్షించడం వల్ల ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా సాగుతుంది. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 50 కోట్ల డోస్‌లు ఇచ్చారని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.
ప్రధాని నరేంద్ర మోదీ గారు గర్భాశయ క్యాన్సర్ నివారణపై అంతర్జాతీయ వేదికలపై (ఉదాహరణకు క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్ ఈవెంట్) నిరంతరం గళం వినిపిస్తున్నారు. 2.6 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సేకరించడంలో ‘గావి’ (Gavi) తో కుదుర్చుకున్న ఒప్పందం ఈ విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతోంది.
మహిళా క్యాన్సర్ కేర్ కోసం జీవితాంతం కృషి చేస్తున్న వైద్యుడిగా, నేను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు , సమాజ పెద్దలకు ఇచ్చే పిలుపు ఒక్కటే: ఈ ప్రాణదాత అయిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అపోహలను తొలగిస్తూ, అర్హులైన ప్రతి 14 ఏళ్ల బాలికకు ఈ రక్షణ కవచం అందేలా మనం కృషి చేయాలి.
ఒక్క డోస్ వ్యాక్సినేషన్ వ్యూహంతో భారత్ ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశం ఇస్తోంది—అది ‘భారత పుత్రికల ప్రాణాలు మాకు అత్యంత ప్రాధాన్యం’. గర్భాశయ క్యాన్సర్ అనేది చరిత్ర పుస్తకాలకే పరిమితం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. భారతీయ మహిళలు మరింత కాలం, ఆరోగ్యంగా , సాధికారతతో జీవించే సుదినం ఇది.
డాక్టర్ దత్తాత్రేయుడు నోరి
(ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాల క్యాన్సర్ కేర్ సలహాదారులు)




