Donald Trump : జమ్మూకశ్మీర్ లోని పెహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది స్పందిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ‘పెహెల్గాంపై ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచి వేసింది. 27 మంది ప్రాణాలు పోవడం పెను విషాదం. ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో భారత్ కు అమెరికా అండగా ఉంటుంది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం’ అంటూ సోషల్ మీడియాలో తెలిపారు. ఇదే విషయంపై ఇండియాలో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా స్పందించారు. ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచి వేసిందని సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.
Read Also: JD Vance: ‘‘ ప్రధాని మోడీని చూస్తే నాకు అసూయ’’.. యూఎస్ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
‘ఈ దేశ ప్రజలు ప్రేమ, మాధుర్యాన్ని మేం కొన్ని రోజులుగా ఆస్వాదిస్తున్నాం. కశ్మీర్ ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఇది పాశివక దాడి. దానికి నేను, ఉష సంతాపం వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇలాంటి దాడులను అస్సలు ఉపేక్షించేది లేదు’ అంటూ తెలిపారు జేడీ వాన్స్.
అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనిపై స్పందించారు. ‘ఈ దారుణమైన ఘటనను అస్సలు ఉపేక్షించేది లేదు. కచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉన్న వారిని శిక్షించి తీరాల్సిందే. ఈ విషయంలో పోరాడటానికి భారత్ కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎలాంటి విషయాలకు అయినా సహకారం అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడ్డ వారు త్వరగాకోలుకోవాలి’ అంటూ తెలిపారు. వీరే కాకుండా ఇతర దేశాల అధ్యక్షులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రదాడి విషయంలో భారత్ కు అండగా నిలుస్తున్నారు.