ఓ చిన్న క్లిక్.. ఓ వ్యక్తికి లక్షల రూపాయల నష్టం తీసుకువచ్చింది. సైబర్ మాయగాళ్లు కొత్త పద్ధతులతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక నోటిఫికేషన్‌ను క్లిక్ చేయడంతో ఏకంగా 24 లక్షలకు పైగా కోల్పోయాడు. స్టాక్ మార్కెట్‌లో ప్రత్యేక పెట్టుబడి అవకాశమంటూ నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు చివరికి అతన్ని మోసం చేశారు. ఈ మోసం ఎలా జరిగింది..? ఇందులో ఉన్న సైబర్ గ్యాంగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి?
చీరాల వైకుంఠపురానికి చెందిన హనుమకొండ గోపి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ ప్రకటన గోపి దృష్టిని ఆకర్షించింది. తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని చూపించిన ఆ ప్రకటనలో ఉన్న నోటిఫికేషన్‌ను చూసి ఆకర్షితుడైన గోపి ఆ లింక్‌ని క్లిక్ చేశాడు. దీంతో వెంటనే గోపికి ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన వివరాలు కనిపించాయి. తర్వాత సైబర్ మోసగాళ్లు అతన్ని సంప్రదించి ప్రత్యేక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఉందని చెప్పారు. మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చినట్టు యాప్‌లో చూపించారు. మోసగాళ్ల మాటలను నమ్మి విడతల వారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు గోపి. అలా మొత్తం రూ.24 లక్షల 16 వేల రూపాయలు వివిధ బ్యాంక్ ఖాతాలకు పంపించాడు. అయితే డబ్బులు పంపిన తర్వాత తన పెట్టుబడిపై లాభాలు తీసుకోవాలని ప్రయత్నించగా యాప్ పనిచేయకపోవడం.. నోటిఫికేషన్‌లో ఉన్న ఫోన్ నెంబర్ అందుబాటులో లేకపోవడం అనుమానం కలిగించింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన గోపి.. చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…
ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి.. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా ప్రజలను మోసం చేయడం సైబర్ గ్యాంగ్‌ల ప్రధాన పద్ధతిగా మారింది. మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం కలిగించడం.. తర్వాత పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టించేలా చేయడం ఈ మోసాల ముఖ్య లక్షణం. సైబర్ నేరగాళ్లు తమకు దొరికిన వ్యక్తులకు మొదట నమ్మకం కలిగించడం. తర్వాత పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టడం సాధారణ ఎత్తుగడగా పోలీసులు చెబుతున్నారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన బ్యాంక్ ఖాతాలు, మొబైల్ నంబర్లు, డిజిటల్ ట్రేస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మోసాల వెనుక రాష్ట్రం బయట ఉన్న సైబర్ గ్యాంగ్‌ల పాత్ర ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు.. తెలియని లింకులు క్లిక్ చేయకూడదని, సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు… స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టే ముందు అధికారిక, నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇన్‌స్టాలో ప్రకటన.. ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు పోయిన చీరాల వాసి ఉదంతంతో సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడలపై అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి చెబుతోంది…




