22
March, 2026

A News 365Times Venture

22
Sunday
March, 2026

A News 365Times Venture

Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

Date:

ప్రధాని మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పని చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ.. మొత్తం 8,931 రోజుల పాటు విరామం లేకుండా అధికారంలో కొనసాగిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. అసలు సర్పంచ్ కూడా కాని వ్యక్తి సీఎం ఎలా అయ్యారు..? తొలిసారి ఎంపీకి.. ప్రధాని పదవి ఎలా దక్కింది..? అధికారం వచ్చింది సరే.. దాన్ని సుస్థిరం చేసుకోవటానికి మోడీ సీక్రెట్ ఏంటి..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ ప్రజల్ని మెప్పిస్తేనే అధికార పీఠం దక్కుతుంది. ఒక్కసారి పవర్లోకి రావడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో.. దశాబ్దాల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగటం చిన్న విషయం కానే కాదు. అందులోనూ విభిన్న రాజకీయ పరిస్థితులు, సవాళ్ల మధ్య కూడా విజయపథంలో కొనసాగాలంటే.. ఆ నేతకు ఏవో ప్రత్యేక లక్షణాలు కచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలే మోడీని సుదీర్ఘకాలం కొనసాగుతున్న ప్రభుత్వాధినేతను చేశాయి. అసలు మోడీ అధికార ప్రస్థానమే చాలా వింతగా మొదలైంది. ఆ తర్వాత కూడా ప్రతి మలుపులోనూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. మోడీ అధికారంలో కొనసాగుతూ వచ్చారు. గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి అత్యధిక కాలంలో పదవిలో ఉన్న ప్రభుత్వాధినేతగా ఉండేవారు. ఇప్పుడు ఆ మైలురాయిని ప్రధాని మోడీ దాటేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోదీ.. నాటి నుంచి నేటి వరకు వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగుతుండటం చిన్న విషయం కానే కాదు. ఇందులో పన్నెండేళ్లు సీఎం కాగా.. ప్రధానిగా పన్నెండేళ్లు గడిచాయి.

నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గుజరాత్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2001 నుంచి 2014 వరకు మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. 2014లో దేశ పగ్గాలు చేపట్టిన మోడీ.. వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ పథంలో నడిపించారు. గతేడాది జూలైలోనే ఆయన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి.. వరుసగా అత్యధిక కాలం పని చేసిన రెండో ప్రధానిగా నిలిచారు. స్వాతంత్ర్యానంతరం జన్మించి.. అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నేత కూడా మోడీనే. అంతేకాకుండా కేంద్రంలో రెండు సార్లు పూర్తి పదవీ కాలాన్ని ముగించుకుని, మూడో సారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు. వరుసగా ఆరు ఎన్నికల్లో అంటే మూడు సార్లు అసెంబ్లీ, మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో.. ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది.

ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు. గుజరాత్‌లో అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించిన కొద్ది రోజుల్లోనే 2001లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 13వేల మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో మరణించారు. ఒక కచ్ ప్రాంతంలోనే 12వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదాన్ని మోడీ ఒక అవకాశంగా భావించారు. కచ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చటం కోసం వాటికి రాయితీలు కల్పించారు. నరేంద్రమోడీ విధానాల మూలంగా గుజరాత్ మొత్తం ఒక ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందనే ప్రచారం బలంగా చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా పేరు మార్మోగేలా చేశారు. తొలిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు మోదీ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని పాలిస్తారని ఎవరూ ఊహించలేదు. గోద్రా అల్లర్ల తర్వాత క్యాబినెట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన మోడీ.. వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి.. గుజరాత్ లో తిరుగులేని నేతగా మారారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ విఫలమైన తరుణంలో.. మోడీ దూసుకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్ ప్రచారం దేశవ్యాప్తంగా జరగడంతో.. మోడీకి అన్ని రాష్ట్రాల ప్రజల్లో ఆమోదయోగ్యత వచ్చింది. ఆకట్టుకునే ప్రసంగాలు, అవినీతి మరక లేని పాలన లాంటి అంశాలు దేశ ప్రజల్ని ఆకర్షించాయి. అప్పటికే యూపీయే పాలనతో విసిగిపోయిన ప్రజలు.. మోడీలో కొత్త నేతను చూశారు. రాక్ స్టార్ లా మోడీ పెట్టిన ప్రచార సభలు అందర్నీ ఉర్రూతలూగించాయి. అలా 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మోడీ మానియాలో దేశం మైమరిచిపోయింది. మోడీ ప్రధాని అయితే.. సమస్యలన్నీ పరిష్కారమౌతాయని ప్రజలందరూ బలంగా నమ్మారు. అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బీజేపీకి 2014 కంటే సీట్లు పెరగడానికి మోడీ ఇమేజే ప్రధాన కారణం. చివరకు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించిన మోడీ తన ఇమేజ్‌కు తిరుగులేదని చాటుకున్నారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని ప్రజలు చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవీ రాజ్‌ను, బుజ్జగింపు రాజకీయాలకు.. బలమైన ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన మోడీ రేకెత్తించలిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు.. అభివృద్ధి రాజకీయాలకు మధ్య బ్యాలెన్స్ తీసుకురాగలిగారు. మోడీ బ్రాండ్ మేనేజ్ మెంట్ లోనే సక్సెస్ సీక్రెట్ ఉందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పట్నుంచీ ఇప్పటిదాకా.. ప్రతి ఐదేళ్లకు మోడీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యేనాటికి మోడీకి అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆరెస్సెస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. దీంతో ఆరెస్సెస్ ప్రచారక్ అనే స్థాయి దాటేసి.. చాలా పెద్ద హిందుత్వ వాదిగా అవతరించారు. మళ్లీ 2007 వచ్చేసరికి మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్ గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే.. అభివృద్ధికి గుజరాత్ ను పర్యాయపదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే.. దేశం కూడా కచ్చితంగా మారుతుందని మెజార్టీ ప్రజలు నమ్మారు. అదే మోడీ 2019 ఎన్నికల నాటికి.. దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. తర్వాత 2024 ఎన్నికల సమయంలో రాముడ్ని అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయప్రస్థానం కొనసాగిస్తున్నారు మోడీ. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మోడీ సరికొత్త బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకుంటూ వచ్చారు. హిందూ హృదయ సామ్రాట్ అనేది గుజరాత్ వరకు సరిపోయింది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టగానే.. దేశాన్ని మార్చగల నేతగా అవతరించారు. క్రమంగా వికాస్ పురుష్ గా, విశ్వగురువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ దృక్పథం కార్పొరేట్లను కూడా మెప్పించింది. సుస్థిర సమగ్ర అభివృద్ధి, పెట్టుబడులకు రెడ్ కార్పెట్, అవినీతికి చెక్ లాంటివి అందరికీ నచ్చాయి.

అసలు మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి అనుకున్నారంటే.. ఆరు నూరైనా ఆ పనైందాకా నిద్రపోరు మోడీ. అలాగే మోడీ పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోటులేదు. ఎంత కష్టమైనా పడి అనుకున్నది సాధించాలనే తపనతో పనిచేస్తారు. తన అంకితభావంతో కింది నేతలు, కార్యకర్తల్లోనూ స్ఫూర్తినిస్తూ.. వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకగా తీసుకుంటారు. ఆ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. కచ్ భూకంపంతో నైరాశ్యంలో కూరుకుపోయిన గుజరాత్.. ఆ తర్వాత ఇంతగా వెలుగులీనుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ మోడీ చేసి చూపించారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కూడా ఎన్నికల పండితులు ఊహించలేదు. కానీ అది కూడా సాధ్యమేనని నిరూపించారు మోడీ. ఇక దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే విషయం కూడా ఎవ్వరి ఊహకూ అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు.. ఏకంగా రెండుసార్లు సాధ్యం చేశారు మోడీ. అంతేకాదు వరుసగా మూడోసారి కూడా మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారీ.. దిమ్మతిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతికొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకర్షించడం మోడీ శైలి. ప్రత్యర్థులు కూడా తిరస్కరించలేని ఆలోచనల్ని దేశం ముందుంచడం ఆయనకు అలవాటు. మొదట్లో ఆరెస్సెస్ ఉద్యమించినప్పుడు అయోధ్య రామ మందిరం హిందువులకు సంబంధించిన విషయం మాత్రమే. కోర్టుకైతే అది కేవలం భూవివాదమే. కానీ మోడీ వచ్చాక రామాలయ నిర్మాణం జాతి కర్తవ్యంగా రూపు తీసుకుంది. గతంలో రామాలయానికి చాలా అడ్డంకులు ఉంటాయనే భావన ఉండేది. కానీ ఒక్కో అడ్డంకినీ తప్పిస్తూ.. సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయడం.. మోడీ చేసిన పెద్ద టాస్క్ అని చెప్పడంలో సందేహం లేదురాముడు దేశం ఆస్తి.. రామాలయం.. దేశం బాధ్యత అనే స్థాయికి తెచ్చారు మోడీ. ఒక్క అయోధ్య రామాలయమే కాదు.. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు అంశాల్లోనూ మోడీ అలాగే పని చేశారు. ఆర్టికల్ 370 రద్దైతే ఏం జరుగుతుందోననే భయాలు నెలకొన్న సమయంలో.. ఏకంగా కశ్మీర్‌ను రెండుగా విభజించినా.. ఎవరూ నోరెత్తకుండా చేయగలిగారు. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లిం మహిళలందర్నీ కూటగట్టి.. బలమైన వ్యతిరేకత వచ్చినా దాన్ని అధిగమించి.. చివరకు అనుకున్న పని చేసి చూపించారు. పైగా ఏం చేసినా ఎక్కడా దుష్పరిణామాలు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు మోడీ.

పాలనా పరంగా కూడా మోడీ ఎన్నో నిర్ణయాల్ని ధైర్యంగా తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని పరిణామం ఎలా ఉన్నా.. చివరకు తనకు అనుకూలంగా మార్చుకోవడం మోడీకే చెల్లింది. అలాగని తాను అనుకున్నది అవ్వని పరిస్థితులు ఎదురైనప్పుడు.. మొండిగా ముందుకెళ్లటం ఆయన శైలి కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత మోడీ. తనకు సమయం వచ్చేవరకు ఎదురుచూస్తారు. అదను చూసి ముందడుగు వేస్తారు. రైతు చట్టాల విషయంలో మోడీ అలాగే చేశారు. సీఏఏ విషయంలోనూ ఆచితూచి అడుగేయటానికి సంకోచించలేదు. ఎవరికి ఇష్టం ఉన్నా.. లేకున్నా తన ప్రతిష్ఠే ముఖ్యమనే ఆలోచన చేయడం ఆయనకు అలవాటు లేని పని. మాట నెగ్గటం కంటే రాజకీయంగా నెగ్గటం ముఖ్యమని మోడీకి తెలుసు.

వృద్ధుల పార్టీగా ఉన్న బీజేపీని యువతరానికి ఆకర్షణీయంగా మార్చడంలో మోడీ సక్సెస్ అయ్యారు. వాజ్‌పేయి, అద్వానీ టైమ్‌లో ఉన్న బీజేపీకి.. మోడీ వచ్చిన తర్వాత బీజేపీకి చాలా తేడా ఉంది. అలాగని మోడీ యువ నేత కాదు. అయినా సరే ఆయన వయసుతో సంబంధం లేకుండా పనితీరుతోనే దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకోగలిగారు. 2014 నుంచి ఇప్పటివరకూ యువత ఆయన వెన్నంటే ఉండటం మోడీకి పెద్ద అడ్వాంటేజ్. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే.. దాన్ని మోడీ కంటే బాగా ఉపయోగించుకునే రాజకీయ నేత మరకొరు మనకు కనిపించరు. అసలు రాజకీయ నేతలకు సోషల్ మీడియా గురించి తెలియని రోజుల్లోనే.. దాన్ని విస్తృతంగా విజయవంతంగా ఉపయోగించుకున్న చరిత్ర మోడీకి ఉంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో మోడీ ఫాలోవర్ల విషయంలో.. ప్రపంచ నేతల్ని కూడా మించిపోతూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు.

ఇక మోడీ దగ్గరున్న మరో ప్రత్యేక లక్షణం.. పై నుంచి కిందిదాకా అన్నీ తానై పనిచేసే తీరు. నాయకుడు అంటే పనిచేయాల్సిందేకానీ.. పనిచేయకూడదనే పడికట్టు శైలికి మోడీ పూర్తిగా వ్యతిరేకం. మోడీ దగ్గర ఒకటి, రెండు, మూడు అనే నంబర్లు ఉండవని, ఒకటి నుంచి ఐదో స్థానం వరకూ ఆయనే ఉంటారు. పనిని దైవంగా నమ్మే మోడీ.. రాజకీయాన్ని కూడా నిష్ఠగా చేస్తారనేది బీజేపీ వర్గాల మాట. అంత అంకితభావం ఉండబట్టే రాజకీయ నేతగా మోడీ ప్రభావం.. మిగతా నేతల కంటే భిన్నంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

మోడీ సుదీర్ఘ అధికార జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. వరుస ఎన్నికల్లో విజయాలు ఆయనకు ఆషామాషీగా రాలేదు. అవినీతి కనిపించని పాలన, జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలు.. ఇలా మోడీ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి.. దేశానికి బలమైన ప్రధానిగా ఎదిగిన చరిత్ర మోడీ సొంతం. కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం చూస్తున్న బీజేపీకి.. మోడీ ఆశాకిరణంలా దొరికారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలూ అర్రులు చాస్తున్నాయంటే.. దానికి మోడీ మ్యాజిక్కే కారణం.కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగిన మోడీ.. ఇప్పుడు పార్టీలో సర్వంసహా ఆధిపత్యాన్ని సంపాదించారు. మరే నేతకూ సాధ్యం కాని రీతిలో కొంతవరకు వ్యక్తిపూజ సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే బీజేపీలో చేరాలంటే ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే నిబంధనలకు నీళ్లొదిలారు. ఎవరైనా చేరొచ్చని, బీజేపీ కూడా మిగతా పార్టీల్లాంటిదేనని లిబరల్ లుక్ ఇచ్చారు. బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేనివాళ్లు, అసలు రాజకీయాలపై ఇంట్రస్ట్ లేని వాళ్లు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది.

దేశంలో రాజకీయం చేయడం ఒక ఎత్తైతే.. ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మంది నేతలకు ఈ సూక్ష్మం తెలియకే రాజకీయ తెరపై కొంతకాలం వెలిగి తెరమరుగైపోతున్నారు. కానీ మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాన్ని పూర్తిస్థాయిలో ఔపోసన పట్టారు. అసలు ఎన్నికలు అంటే పండగ అని ప్రకటించిన తొలి అగ్రనేత మోడీనే అంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా నేతల్లా ఎన్నికలప్పుడే వాటి గురించి ఆలోచించే నేత కాదు మోడీ. అనుక్షణం ఎన్నికల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతాయి. ప్రధానిగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే చాలనుకునే వ్యక్తి కూడా కాదు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం దక్కింది కొన్నాళ్లు రిలాక్స్ అవుదాం అని కూడా మోడీ ఆలోచించరు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా.. జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచించటం ఆయన నైజం.

అంతకుముందు ఎన్నికలొస్తే చాలు అన్ని పార్టీల మాదిరే బీజేపీ కూడా టెన్షన్ పడేది. పైస్థాయి నేతలకు తగ్గట్టుగానే కిందిస్థాయిలో కార్యకర్తలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారు. కానీ మోడీ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మిగతా పార్టీలకు భిన్నంగా ఎన్నికలు వస్తే బీజేపీ మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. పై స్థాయి నుంచి కిందిస్థాయి సరికొత్త వ్యూహరచన కనిపిస్తోంది. దీనికి మోడీ ఇచ్చిన స్ఫూర్తే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్ని పండగలా సెలబ్రేట్ చేసుకుని.. ప్రజల ఆశీర్వాదం తీసుకునే అద్భుత అవకాశంగా చూడాలనే మోడీ సరికొత్త థియరీ.. ఎన్నికల విషయంలో బీజేపీ దృక్పథాన్నే మొత్తంగా మార్చేసింది. అప్పటి నుంచి ఆ పార్టీకి ఎప్పుడూ ఊహించని ఫలితాలు చాలా అలవోకగా వస్తున్నాయి. కొన్నిసార్లు బీజేపీ సాధిస్తున్న ఫలితాల్ని చూసి.. ప్రత్యర్థులు కూడా ఏదో జరిగిందని అనుమానించే పరిస్థితి. కొందరు ప్రత్యర్థులు బీజేపీ గెలుపు సూత్రాల్ని కొంతవరకు అర్థం చేసుకున్నా.. ఇంతవరకూ ఎవరూ పూర్తిస్థాయిలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్నికల పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయారు. ఎన్నికల విషయంలో మోడీ పనితీరు, ఆలోచన పద్ధతి ఎలా ఉంటుందో చెప్పటానికి ఆయన సుదీర్ఘ రాజకీయాన్ని పరిశీలించాల్సిన పని లేదు. గత రెండేళ్ల పనితీరు చూసినా.. ఆ సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది.

2024 లోక్‌సభ ఎన్నికల్ని ప్రామాణికంగా తీసుకుంటే.. ఆ ఎన్నికల్లో మిత్రులతో కలిసి మోడీ విజయం సాధించారు. హ్యాట్రిక్ పీఎం అనే ట్యాగ్ వచ్చినా.. ఆయన ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు. ఆ ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలో వచ్చిన మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన చేశారు. ఎన్నికలు రాగానే ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. అనుకున్న ఫలితం సాధించారు. అక్కడితో ఆగితే ఆయన మోడీ ఎందుకవుతారు. అసలు ఎన్ని విజయాలు సాధించినా తృప్తి పడటం మోడీకి ఇష్టం ఉండదు. రాజకీయ నేతగా ఒక్క గెలుపుతోనో.. కొన్ని విజయాలతోనే సంతృప్తి చెందితే.. ఇక భవిష్యత్తు ఉండదనేది ఆయనకు ఆయనగా పెట్టుకున్న రాజకీయ సూత్రం. దేశంలోనే అత్యంత విజయవంతమైన నేతగా ఉన్నా కూడా మోడీ తాను పెట్టుకున్న సూత్రాల విషయంలో రాజీ పడరు. ఓవైపు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే.. మరోవైపు వ్యక్తిగతంగా తన రాజకీయ సూత్రాల్ని కూడా మేళవించి ఎన్నికల్లో ప్రయోగించటం మోడీకి అలవాటు.

ఎన్నికల ప్రచారం విషయంలో మోడీకి విసుగు లేదు. అలుపు రాదు. తాను ప్రచారం చేసే రాష్ట్రంలో బీజేపీ గెలుపు అవకాశాలు, పార్టీ అస్తిత్వం.. ఇవేవీ ఆయనసలు పట్టించుకోరు. ఏ రాష్ట్రంలో అయినా.. ఏ ప్రాంతంలో అయినా బీజేపీ జెండా ఎగిరేలా చేయటానికి తనకు చేతనైనంత పని చేయాలనే ఏకైక లక్ష్యంతో మోడీ పనిచేస్తారు. ఎన్నికల ప్రచారం అంటే మూస పద్ధతుల్లో కాకుండా.. రాష్ట్రాన్ని బట్టి.. అక్కడి ప్రజల ఆలోచన తీరును బట్టి.. శైలి మార్చుకోవాలని ఆయన సూచిస్తారు. స్వయంగా పాటిస్తారు కూడా. బీజేపీ ఎంత ప్రచారం చేసినా.. దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు రావడం లేదన్న ఆ పార్టీ నేతల మాటల్ని ఆయన లైట్ తీస్కుంటారు. గెలిచేదాకా ప్రచారం చేస్తూనే ఉండాలంటారు. ఆ పట్టుదలతోనే గతంలో బీజేపీ గెలవని ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో గెలిచిందనేది మోడీ నమ్మకం. ఇప్పటివరకూ కాషాయ పార్టీ ఖాతా తెరవని రాష్ట్రాల్లోనూ ఇదే సూత్రం అమలుచేయాలనేది మోడీ వ్యూహం. ఇక్కడ కేవలం వ్యూహరచన చేయటమే కాదు.. ఆ వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేయడంలోనూ ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న మోడీ.. ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూనే.. అప్పుడే వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లోనూ ప్రచారానికి వెళ్తున్నారు. అలా చూసుకుంటే.. ఎన్నికల ప్రచారం విషయంలో మోడీ అందరికంటే ముందుంటారని చెప్పాలి.

మోడీ ఎన్నికల ప్రచారం కూడా భిన్నంగానే ఉంటుంది. ఏదో ప్రచారం చేశామంటే చేశాం.. అంతటితో నా పనైపోయిందనుకునే సగటు నేత కాదు మోడీ. తన ప్రచారానికి ఎంత ఫలితం వచ్చిందో.. తనకు తానుగా బేరీజు వేసుకుంటారు. పార్టీలో తనను అడిగేవారు ఎవరూ లేకపోయినా.. ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకునేలా పనిచేయాలనుకుంటారు మోడీ. ఈ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తారు కాబట్టి.. మోడీ రోడ్‌షోలు, సభలు.. చాలావరకు విజయవంతమౌతాయి.

దేశంలో ఎక్కువ మంది జనం మోడీతో నేరుగా కనెక్టవుతున్నారు. భిన్నాభిప్రాయాలున్నా.. భిన్నమైన రాజకీయ పార్టీల సానుభూతిపరులుగా ఉన్నా..ఏ సందర్భంలో అయినా మోడీతో కనెక్ట్ అవుతున్నారు. మార్కెటింగ్ లో కీలకంగా భావించే పబ్లిక్ రిలేషన్ అనే పాయింట్ ను మోడీ ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మెజార్టీ ప్రజలతో మోడీ నేరుగా సంబంధం పెట్టుకున్నారు. మోడీ మన మనిషి అని చాలా మంది అనుకునేలా చేసుకుంటున్నారు. జనంతో మోడీకి ఉన్న ఈ కనెక్షన్ సిద్ధాంతాలు, భావజాలాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. దేన్నైనా కేవలం ప్రచారంతో చర్చనీయాంశం చేసే సత్తా మోడీ బ్రాండ్ కు ఉంది. అన్నింటికీ మించి అత్యంత సాధారణ జీవితం నుంచి.. దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన మోడీ ప్రస్థానంపై దేశ ప్రజలంరికీ గౌరవం ఉండటం కూడా ఆయనకు కలిసొస్తోంది. మొత్తం మీద ప్రస్తుతానికి అత్యంత సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించిన మోడీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రధానిగా నెహ్రూ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్డీవీ.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

తెలంగాణ అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తీపి కబురు అందించారు....

CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా ఒక...

Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

మధ్యప్రాచ్యంలో యుద్ధం అత్యంత భయంకరమైన , ప్రమాదకరమైన దశకు చేరుకుందని ప్రపంచ...

Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..

Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది....