Botsa Satyanarayana: శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు.. జూలై 11న జరగనున్న జేఎన్టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో కాకుండా విజయనగరంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వెనుకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధి లక్ష్యంతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించడం సముచితమని లేఖలో పేర్కొన్నారు బొత్స..
విశ్వవిద్యాలయం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో తొలి స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారని, మరో రెండు నెలల్లో విజయనగరం క్యాంపస్ పూర్తిగా అందుబాటులోకి రానుందని బొత్స గుర్తుచేశారు. అలాంటి సమయంలో విశాఖలో కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం విజయనగరం జిల్లా ప్రజలలో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తన లేఖ ద్వారా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ..




