ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టులో మరోసారి భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగుచూసింది. పేదలకు అందాల్సిన పౌర సరఫరాల బియ్యాన్ని (PDS Rice) ఇతర దేశాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా సివిల్ సప్లై అధికారులు అడ్డుకున్నారు. ఐదు లారీల్లో తరలిస్తున్న సుమారు 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 65 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ల్యాబ్ టెస్టింగ్‌కు పంపగా, అందులో ప్రభుత్వం సరఫరా చేసే ఫోర్టిఫైడ్ కెర్నల్స్ (Fortified Kernels) కలిసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇది ఖచ్చితంగా రేషన్ బియ్యమేనని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు.
Karimnagar SI Suicide: కరీంనగర్ ఎస్సై ఆత్మహత్యకు కారణం ఇదేనా?
ఈ అక్రమ రవాణా వెనుక ఐదు ప్రధాన రైస్ మిల్లుల హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజానగరంలోని గోల్డెన్ ఆగ్రోస్, గుడిదత్త రైస్ మిల్, జగ్గంపేటలోని బాలాజీ బాయిల్డ్ రైస్ మిల్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ , విశాఖపట్నంలోని మోతపూర్ ఆగ్రోస్ నుంచి ఈ బియ్యం పోర్టుకు చేరుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గతంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ, యథేచ్ఛగా రేషన్ బియ్యం పోర్టుకు చేరుతుండటంపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, ఈ బియ్యం ఏ ఏ రేషన్ షాపుల నుంచి సేకరించారనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.




