Common Health Issues in Men: పురుషులు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు రకరకాల పనుల్లో.. బిజీగా ఉంటారు.. వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నా లైట్‌గా తీసుకుంటారు.. పురుషుల ఆరోగ్యం అంటే చాలా మంది జిమ్ వ్యాయామాలు, బలం, ప్రోటీన్ డైట్లు వంటి విషయాలతోనే పరిమితం చేస్తారు. కానీ, నిజమైన ఆరోగ్యం అనేది మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను గుర్తించడం, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంలో ఉంది. చాలాసార్లు పురుషులు కొన్ని ఆరోగ్య సమస్యలను చిన్నవిగా తీసుకొని పట్టించుకోరు. దీని వల్ల అవి పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు పురుషుల్లో ఎక్కువగా కనిపించే సమస్యలు ఏడు ఉన్నాయి.. కానీ, వీటిపై వారు బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడరట..
1. దీర్ఘకాలిక అలసట.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు: రోజంతా పని చేసిన తర్వాత అలసట అనేది సహజమే. కానీ, ఎప్పుడూ అలసటగా అనిపించడం సాధారణం కాదు. ఇది శరీరంలో పోషకాహార లోపాలు, థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర జీవక్రియ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది.
2. యువకుల్లోనూ గుండె సంబంధిత ప్రమాదాలు: గుండె జబ్బులు పెద్దవారికి మాత్రమే వస్తాయని అనుకోవడం తప్పు. ఈ రోజుల్లో 30–40 ఏళ్ల పురుషుల్లో కూడా హార్ట్ సమస్యలు పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కారణాలు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం అంటున్నారు వైద్యనిపుణులు..
3. ఒత్తిడితో కోపం లేదా ఒంటరితనం: పురుషులు తమ భావోద్వేగాలను బయటపెట్టడంలో కొంచెం వెనుకబడతారు. ఒత్తిడి ఉన్నప్పుడు దాన్ని మాటల్లో చెప్పకుండా కోపంగా, చిరాకుగా లేదా ఒంటరిగా ఉండడం ద్వారా వ్యక్తపరుస్తారు. ఇది మానసిక ఆరోగ్యంపై, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది.
4. నిద్రలేమి ప్రభావం: సరైన నిద్ర లేకపోవడం చాలా పెద్ద సమస్య. గురక, రాత్రి మధ్యలో మేలుకోవడం, ఉదయం లేవగానే అలసటగా ఉండటం ఇవి నిద్ర సంబంధిత సమస్యల సంకేతాలు. దీని వల్ల బరువు పెరగడం, ఏకాగ్రత తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం జరుగుతుంది.
5. జీర్ణ సమస్యలను తేలికగా తీసుకోవడం: ఎసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను చాలా మంది పురుషులు పట్టించుకోరు. కానీ, ఇవి పేగు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సూచనలు కావచ్చు. సరైన ఆహారం, నీరు, జీవనశైలి మార్పులు అవసరం.
6. క్రమంగా పెరుగుతున్న బరువు: బరువు ఒక్కసారిగా పెరగదు. పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అసమయ ఆహారం ఇవి బరువు పెరగడానికి కారణాలు. దీని వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.
7. హెల్త్ టెస్ట్‌లను నిర్లక్ష్యం చేయడం: చాలా మంది పురుషులు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాకే డాక్టర్‌ను సంప్రదిస్తారు. కానీ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించవచ్చు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చాలా ముఖ్యం.
పురుషుల ఆరోగ్యం అంటే కేవలం శారీరక బలం కాదు. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం, సమయానికి స్పందించడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు. మంచి ఆరోగ్యం అనేది ఒక్కరోజులో రాదు.. అది రోజువారీ మంచి అలవాట్ల ద్వారా నిర్మించబడుతుంది అంటున్నారు వైద్య నిపుణులు..




