28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

Date:

ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే వ్యూహం మార్చుకుంటారు. అంతేకానీ యుద్ధం ముగించటానికి వ్యూహరచన సాధారణంగా అవసరం ఉండదు. కానీ ఇరాన్ యుద్ధం మాత్రం అమెరికాకు ఇలాంటి విచిత్ర పరిస్థితిని పరిచయం చేసింది. ఏదో అనుకుని మొదలుపెడితే.. ఇంకేదో అవుతోందని.. ట్రంప్ ఎగ్జిట్ గేమ్ మొదలుపెట్టారు. కానీ ట్రంప్ ఎత్తులకు ఇరాన్ పైఎత్తులు వేస్తుండటం.. అటు ఇజ్రాయెల్ కలిసిరాకపోవడం.. అమెరికాకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో యుద్ధం నుంచి వెనుదిరగటానికి ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అమెరికా అయోమయం ప్రపంచానికి స్పష్టంగా అర్థమైపోతోంది. అమెరికా ఇరాన్‌లో చేతులెత్తేసింది. కాకపోతే కవర్ చేసుకుంటోంది. 24 రోజుల యుద్ధం తర్వాత కానీ ట్రంప్‌కు తత్వం బోధపడలేదు. ఇరాన్‌ ప్రతిఘటనతో బిత్తరపోయిన ట్రంప్‌.. చేసేది లేక దాడులకు విరామం ప్రకటించి.. దాన్ని పొడిగిస్తూ పోతున్నారు. అటు స్వదేశంలో వెల్లువెత్తుతున్న విమర్శలతో.. ట్రంప్‌ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది.

నాలుగైదు వారాల యుద్ధం అనుకున్నారు. చర్చలు జరుగుతుండగానే హఠాత్తుగా దాడి మొదలుపెట్టారు. పైగా తొలిరోజే సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. ఇంకేముంది కొన్ని గంటల్లోనే ఇరాన్ లొంగిపోతుందనుకున్నారు. ఇదీ ఇరాన్ యుద్ధం ప్రారంభంలో ట్రంప్ వేసుకున్న లెక్క. కానీ ఇరాన్ పక్కనే గల్ఫ్ ఉందని, స్వీయ రక్షణ సామర్థ్యం లేని గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతుందని అగ్రరాజ్యం పసిగట్టలేకపోయింది. అటు ఇరాన్ ఏమో మొదట్నుంచీ గల్ఫ్‌ను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. దీంతో దశాబ్దాలుగా అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నవి.. ఇప్పుడు ట్రంప్‌పై మండిపడుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి నట్టేట ముంచారని ఫైరౌతున్నాయి. ఇప్పటికే గల్ఫ్‌లో ఇంధన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీలైనంత త్వరగా పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలక్కపోతే.. ఇక్కడ ఏమీ మిగలదని గల్ఫ్ దేశాలు హెచ్చరించాయి. అయినా సరే మూడు వారాలు మొండిగా నెట్టుకొచ్చిన ట్రంప్.. ఆ తర్వాత నాలుగోవారంలో అస్త్రసన్యాసం సంకేతాలిచ్చి.. చివరకు దాడులకు విరామం ప్రకటించారు. మొదట ఐదు రోజులు.. తర్వాత పది రోజులు గడువు పెంచుకుంటూ పోయారు.

ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. అమెరికా ఆపినా.. ఇరాన్ ఆపటం లేదు. పైగా గల్ఫ్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా వెనుదిరిగేదాకా పోరు ఆగబోదని స్పష్టం చేసింది. పనిలో పనిగా గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. దీంతో మీరేం చేస్తారో మాకు తెలియదు ఇరాన్‌ను ఆపాల్సిందే అని గల్ఫ్ ట్రంప్ దగ్గర మొత్తుకుంటోంది. చివరకు ఇరాన్‌పై తీవ్రస్థాయి దాడులు చేస్తాం.. సర్వనాశనం చేస్తాం.. అంటూ బెదిరింపులకు దిగిన ట్రంప్.. అవసరమైతే ఆర్మీని దించుతామంటూ హడావుడి చేశారు. దీంతో హర్మూజ్‌ను పూర్తిగా మూసేస్తామంటూ ఇరాన్‌ కౌంటరిచ్చింది. అలా చేస్తే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ప్రకటించిన ట్రంప్.. తర్వాత అనూహ్యంగా వెనక్కితగ్గారు. కానీ ట్రంప్ ఏం చేసినా తమకు సంబంధం లేదని.. తమ యుద్ధం కొనసాగేదేనని ఇరాన్ తేల్చేసింది.

నిజానికి ఇరాన్ యుద్ధం అమెరికాకు చాలా గుణపాఠాలు నేర్పింది. మొదటిగా గల్ఫ్‌లో అమెరికా స్థావరాలు సురక్షితం కాదని తేలిపోయింది. తర్వాత ఇరాన్‌ డ్రోన్లను పూర్తిస్థాయిలో అడ్డుకునే సామర్థ్యం కూడా యూఎస్‌ కు లేదని నిరూపించింది. ఇంకా అమెరికా సైన్యం శక్తికి మించిన యుద్ధం చేయాల్సి వచ్చింది. దీనికి తోడు కీలకమైన ఆధునిక క్షిపణి నిల్వలు తరిగిపోతుండటం.. యూఎస్ వ్యూహకర్తలకు ఆందోళన కలిగించింది. అసలు నేవీయే లేదనుకున్న ఇరాన్.. అమెరికా యుద్ధనౌకలపై దాడులకు దిగటం.. చివరకు హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా బ్రిటన్ సంయుక్త స్థావరంపైనా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించడం.. అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది. ఇంత జరిగాక కూడా ఇరాన్ లో ఉంటే.. అమెరికా సైన్యానికి క్షేమం కాదని ట్రంప్‌పై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. ఇక నేవీలో అయితే రాజీనామాల బెదిరింపులు షురూ అయ్యాయి. దీంతో ఇప్పటికైనా యుద్ధం ముగించకపోతే.. సొంత సైన్యం నుంచే తిరుగుబాటు తప్పదనే భయం ట్రంప్‌నకు కలిగింది.

అంతేకాదు అమెరికా కాంగ్రెస్ కూడా ట్రంప్‌నకు సహాయ నిరాకరణ చేసింది. ఓవైపు ఇరాన్‌ నుంచి తక్షణ ముప్పేమీ లేదని ఇంటెలిజెన్స్ తేల్చేయడంతో.. యుద్ధం కోసం అదనపు ఆర్థిక సాయం కావాలన్న ట్రంప్‌ వినతిని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితి కనిపించలేదు. ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు సొంత పార్టీ సభ్యులైన రిపబ్లికన్లు కూడా ట్రంప్ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక అమెరికా ప్రజల సంగతి సరేసరి. వారైతే ఇరాన్ యుద్ధాన్ని అనవసరంగా భావిస్తున్నారు. పోనీ వైట్‌హౌస్‌ అన్నా ట్రంప్‌కు మద్దతిస్తుందా.. అంటే అదీ లేదు. సాక్షాత్తూ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా యుద్ధం పట్ల విముఖంగా ఉన్నారు. ఆ సంగతి కూడా ట్రంపే స్వయంగా ఒప్పుకున్నారు. మరి ఏ తోడూ లేకుండా.. ఎలాంటి లక్ష్యాన్ని ఛేదించలేని స్థితిలో యుద్ధం ఇంకెంతకాలం అనేది ట్రంప్‌నకు కూడా ఆందోళన కలిగించిన విషయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భావనతోనే ట్రంప్‌ ఒకడుగు వెనక్కివేశారు.

కానీ యుద్ధం విషయంలో ట్రంప్ అంచనాలు తప్పినట్టే.. ఇప్పుడు విరామంలోనూ వ్యూహాలు ఎదురుతన్నాయి. చివరకు ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని ప్రకటించినా కూడా భంగపాటు తప్పలేదు. ఇప్పటిదాకా తప్పుడు ప్రకటనలతో ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ట్రంప్‌ను.. ఇరాన్‌ పూర్తిగా తీసిపారేసింది. పైగా ట్రంప్ తనతో తానే చర్చలు జరుపుతున్నారేమోనని గేలిచేసింది. దీంతో ట్రంప్‌నకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ విరామాన్నే పొడిగిస్తూ పోయి.. మరోవపైు చర్చలు జరిపి.. ఇరాన్‌తో ఓ గౌరవప్రదమైన ఒప్పందానికి రావాలనేది ట్రంప్ వ్యూహం. కానీ ఈ వ్యూహాన్ని పసిగట్టిన ఇరాన్.. ఓటమికి.. చర్చల పేరుతో ముసుగు తొడుగుతున్నారని ఆక్షేపించింది. దీంతో ట్రంప్ ఇగో దారుణంగా దెబ్బతింది. అందుకే గతంలో అత్యున్నత స్థాయి కమాండర్ల సూచనతో ఆర్మీని దించే ఆలోచన మానుకున్న ట్రంప్.. మళ్లీ పర్షియన్ గల్ఫ్ దిశగా వేల మంది సైనికుల్ని నడిపించడం.. అమెరికా అయోమయానికి అద్దం పడుతోంది. అసలు ట్రంప్ ఏం చేస్తున్నారో.. ఆయనకైనా అర్థమౌతుందా అనేది కీలక ప్రశ్న.

ట్రంప్ ఇలాగే గుడ్డిగా వ్యూహరచన చేస్తే.. అమెరికాకు అఫ్గాన్, వియత్నాంను మించిన భంగపాటు తప్పదేమోనని అమెరికన్లు నిట్టూరుస్తున్నారు. అమెరికా సైన్యం కూడా ఇష్టం లేకుండా యుద్ధం చేస్తోందని ఇప్పటికే తేలిపోయింది. మరి ఈ స్థితిలో ట్రంప్ ఏం చేస్తారనేది ఆయనకే అంతుచిక్కడం లేదు. మిగతా వ్యవస్థల సంగతి పక్కనపెడితే.. అమెరికా మిలటరీ హెడ్‌క్వార్టర్స్ పెంటగన్‌కైనా ట్రంప్‌ చేష్టలు బోధపడుతున్నాయా అంటే అనుమానమే. ఓవైపు అమెరికాలో పరిస్థితులు బాగాలేవు. మరోవైపు ఇరాన్‌లో అప్రకటిత ఓటమి ఎదురైంది. కానీ ట్రంప్ ఇగో మాత్రం నిజాలు ఒప్పుకోవటానికి సిద్ధంగా లేదు. అందుకే యుద్ధం నుంచి ఎగ్జిట్ ఎలాగా అని ట్రంప్ తర్జనభర్జన పడుతున్నారు. ఏదోలా బయటపడాలని ఆయన చూస్తుంటే.. అమెరికాకు ఇంకా ఉచ్చు బిగించాలని ఇరాన్ పట్టుదలగా ఉంది. దీంతో ఇరాన్ యుద్ధంలో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికాకు.. మరింత క్లిష్ట పరిస్థితులు తప్పటం లేదు.

రాబోయే రోజుల్లో ఇరాన్ ఇంకా ఏం చేస్తుందో అనే ఆలోచన ట్రంప్‌నకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఇప్పటికీ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతుండటంతో.. వాటిని సమాధానపరచటం అమెరికాకు కష్టంగా ఉంది. రేపొద్దున యుద్ధం ఆగినా.. గల్ఫ్ కోలుకోవటం అంత తేలిక కాదు. అప్పుడు మళ్లీ అమెరికా కూడా నిధులివ్వక తప్పని స్థితి రావచ్చు. అదే జరిగితే ఇప్పటికే అప్పుల సంగతేంటని నిలదీస్తున్న కాంగ్రెస్‌కు జవాబు చెప్పడం అంత తేలిక కాదు. మొత్తం మీద ఇరాన్‌కు ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను అన్నట్టుగా ఉంది అమెరికా పరిస్థితి. యుద్ధం మొదలుపెట్టింది మీరైనా.. ముగించేది మాత్రం మేమేనని ముందే చెప్పిన ఇరాన్.. అమెరికాకు ఎప్పుడు ఊరట ఇస్తుందనేది తేలాల్సి ఉంది.

ఇటు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. కీలక కమాండర్లను కోల్పోతున్నా కూడా ఇరాన్ ఎక్కడా తగ్గటం లేదు. మరోవైపు సైన్యం తక్కువైందంటూ యుద్ధ క్షేత్రం నుంచి వస్తున్న సమాచారం నెతన్యాహును కలవరపెడుతోంది. ఇరాన్‌తో చిరకాల శత్రుత్వం ఉన్న ఇజ్రాయెల్.. అమెరికాను కూడా ముగ్గులోకి దింపి.. యుద్ధం మొదలుపెట్టింది. ఎప్పట్నుంచో తమను ముప్పుతిప్పలు పెడుతున్న ఖమేనీని చంపేసి.. కీలక విజయం సాధించేశామని సంబరపడింది. ఇక సుప్రీం లీడర్ ఇరాన్ కథ అమెరికా ముగించేస్తుందనే భ్రమతో.. అసలు యుద్ధ రంగం వదిలి.. ఇరాన్ ప్రేరేపిత ప్రాక్సీ గ్రూపులపై ఫోకస్ పెట్టింది. అంతటితో ఆగకుండా.. ఎప్పట్నుంచీ తీరని కోరికగా ఉన్న గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ బయటకు తీసింది. దాని ప్రకారం ప్రామిస్డ్ ల్యాండ్‌ను సాధించాలనే లక్ష్యంతో లెబనాన్‌లోకి ఆర్మీని దించి.. యుద్ధం చేసుకుంటూ పోయింది. గతేడాది చాలా వరకు హమాస్ ను తుడిచిపెట్టేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు సమూలంగా అన్ని ఉగ్రవాద గ్రూపుల్నీ ఊడ్చేయాలని కంకణం కట్టుకుంది. కానీ ఆ పని మధ్యలో ఉండగానే.. ఇరాన్ సూపర్ ట్విస్ట్ ఇచ్చింది.

ఖమేనీ మరణంతో ముగుస్తుందనుకున్న ఇరాన్ కథ.. మరింత సంక్లిష్టంగా మారడం.. నెతన్యాహుని కూడా కంగారుపెట్టింది. పైగా బలమైన అమెరికా సైన్యాన్ని ఇరాన్ సమర్థంగా ప్రతిఘటించటం.. చివరకు ట్రంప్ కూడా తమను అనవసరంగా యుద్ధంలోకి దించారని ఇజ్రాయెల్‌ను ఆక్షేపించే స్థాయికి పోరు మలుపు తిరగటం.. ఇజ్రాయెల్ ఊహించని పరిణామం. అప్పటికీ అప్పుడప్పుడు అదను చూసుకుని ఇరాన్ కీలక కమాండర్లను చంపుకుంటూ పోతున్నా.. ఎక్కడా ఇరాన్ వెనకడుగు వేయకుండా పోరాడటం నెతన్యాహుకి మింగుడుపడలేదు. ఇది చాలదన్నట్టు యుద్ధక్షేత్రంలో 12 వేల మంది సైనికులు తక్కువయ్యారంటూ కమాండర్ల దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఇజ్రాయెల్‌కు షాకిచ్చింది. ఇలాగే యుద్ధం కొనసాగిస్తే.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలహీనపడే ప్రమాదం ఉందన్న సూచనలు కూడా నెతన్యాుహని కలవరపెడుతున్నాయి.

యుద్ధం ఎలా ముగించాలా అనేది ట్రంప్ సమస్య అయితే.. యుద్ధం ముగిసినా కూడా అనుక్షణం తన ప్రాణరక్షణ ఎలాగా అనేది నెతన్యాహు సమస్య. ఎక్కడున్నా నెతన్యాహుని కచ్చితంగా వేటాడతామని ఐఆర్జీసీ ఇప్పటికే ప్రకటించింది. ఖమేనీ మృతికి ప్రధాన బాధ్యత నెతన్యాహుదేనని, అసలు బీబీ బలవంతంతోనే ట్రంప్ యుద్ధంలోకి వచ్చారని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో అసలు శత్రువు ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మొన్నటిదాకా ఇరాన్‌పై ఆయుధాల పరంగా ఆధిపత్యం చాటుకున్న ఇజ్రాయెల్‌ను ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు తీవ్రస్థాయిలో భయపెడుతున్నాయి.

ప్రపంచానికి టెహ్రాన్‌లో జరిగిన నష్టం వీడియోలు చూపిస్తున్న ఇజ్రాయెల్‌కు.. టెల్ అవీవ్‌లో జరిగిన నష్టం వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ సొంత పౌరులే షాకిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయెల్ గగనతలంలో ఇరాన్ డ్రోన్లు యథేచ్ఛగా స్వైరవిహారం చేస్తున్నాయి. కేవలం టెల్ అవీవే కాకుండా ఇజ్రాయెల్ సురక్షితంగా భావించే దక్షిణ నగరాల మీద కూడా ఇరాన్‌ దాడులు చేస్తోంది. చివరకు ఇజ్రాయెల్ క్షిపణి కాంప్లెక్స్‌ను కూడా వదల్లేదు. దీంతో ఇరాన్‌ ఈసారి ఇజ్రాయెల్‌తో తాడోపేడో తేల్చుకునే దిశగా యుద్ధం చేస్తోందని తేలిపోయింది. గతేడాది తమను తీవ్రంగా దెబ్బకొట్టిన ఇజ్రాయెల్‌ను.. ఈసారి వదలకూడదని ఫిక్సైన ఇరాన్.. ఇంతకుముందెప్పుడూ ప్రయోగించని క్షిపణులతో ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తోంది.

అన్నింటికీ మించి నెతన్యాహు అధికార నివాసంపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం.. ఐడీఎఫ్‌ను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి తర్వాత కొద్దిరోజులు నెతన్యాహు బయటి ప్రపంచానికి కనిపించకపోవడంతో.. ఆయన ప్రాణాలతో ఉన్నారా.. లేదా అనే అనుమానాలు కలిగాయి. చివరకు నెతన్యాహునే స్వయంగా సొంత వీడియోలు రిలీజ్ చేసుకుని.. బతికే ఉన్నానని స్వీయప్రకటన చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అప్పటిదాకా ఇరాన్‌పై తిరుగులేని ఆధిపత్యం సాధిస్తామనే భ్రమలో ఉన్న ఇజ్రాయెల్‌కు వాస్తవం ఏంటో అప్పుడే తెలిసొచ్చింది. అప్పట్నుంచీ నెతన్యాహుకు మరింత భద్రత పెంచారు.

ఇరాన్‌ పని పట్టడానికి తమ ఎయిర్‌ఫోర్స్ ఒక్కటి చాలనుకున్న ఇజ్రాయెల్‌కు.. ఇరాన్‌ కేవలం డ్రోన్లతో ఇస్తున్న ప్రతిఘటన ఆశ్చర్యం కలిగించింది. అప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో ఒకటైన మొసాద్ సమాచారం ఉన్నా కూడా.. ఇరాన్ ఆయువుపట్లపై ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయిలో పట్టుచిక్కలేదంటే అతిశయోక్తి కాదు. అత్యాధునిక సాంకేతికత సాయంతో రహస్య ఆపరేషన్లు చేసే మొసాద్‌కు కూడా అంతుబట్టకుండా ఇరాన్ చేస్తున్న వ్యూహరచన ఇజ్రాయెల్‌కు కూడా ఏమూలో ఓటమి భయాన్ని పరిచయం చేసింది. అసలు అనవసరంగా యుద్ధం మొదలుపెట్టామా అనే ఆలోచన కూడా వచ్చేలా చేస్తోంది.

అలాగని నెతన్యాహు ధైర్యం కోల్పోవడం లేదు. కీలక కమాండర్లను చంపినప్పుడల్లా స్వయంగా ప్రెస్‌మీట్‌ పెడుతున్నారు. కాకపోతే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. పైగా ఇరాన్ పూర్తిగా నాశనం అయ్యేదాకా ఆపరేషన్ ఆగదని కబుర్లు చెబుతున్నారు. అంటే నెతన్యాహుకి కూడా స్పష్టమైన వ్యూహం లేనట్టే. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఇజ్రాయెల్ ప్రజల్లోనూ వ్యతిరేకత రాదనే గ్యారంటీ ఏం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్‌లో ఓ వర్గం నెతన్యాహు యుద్ధ కాంక్షే దేశాన్ని ముంచుతోందని ఆరోపిస్తోంది. ఆ వాయిస్ మరింత బలం పుంజుకుంటే.. నెతన్యాహుకి కూడా ట్రంప్ పరిస్థితి తప్పకపోవచ్చు. అందాకా రాకుండా యుద్ధం ముగించాలని ఇజ్రాయెల్ అనుకుంటున్నా.. ఇరాన్ ఓ పట్టాన లొంగటం లేదు. పైగా రోజుకో కొత్త వ్యూహంతో యుద్ధ రంగంలో సవాలు విసురుతోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరంగా ఇజ్రాయెల్ కంటే ఇరాన్ క్షిపణి స్ట్రైక్‌ రేట్ ఎక్కువగా ఉండటం కూడా నెతన్యాహు పరువు తీస్తోంది. ఈ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ షాహెద్ డ్రోన్లకు డిమాండ్ పెరగటం.. ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్‌ సామర్థ్యంపై అనుమానాలు రావడం.. ఆ దేశానికి ఏమాత్రం మంచిది కాదు.

అలాగని నెతన్యాహు ట్రంప్ మాదిరిగా అస్త్రసన్యాసం చేయలేరు. ఎందుకంటే ఇజ్రాయెల్‌ను భూమ్మీద లేకుండా చేస్తామని చెబుతున్న ఇరాన్‌తో ఎప్పటికైనా ప్రమాదమే. పదేపదే యుద్ధం చేసే బదులు.. ఇప్పుడే తేల్చుకుందామని ఆయన అనుకుంటున్నారు. కానీ అందుకు పరిస్థితులు మాత్రం అనుకూలించటం లేదు. దీంతో ఎక్కువరోజులు ఇజ్రాయెల్ కూడా పట్టుదలగా యుద్ధం చేయడం సాధ్యమేనా అంటే ఔను అని గట్టిగా చెప్పలేని దుస్థితి. యుద్ధంలో మొదట్నుంచీ ఇప్పటిదాకా ఇరాన్ స్థిరంగా ఉంది. చివరకు చర్చల కోసం కూడా ట్రంపే తాపత్రయపడుతున్నారని తేల్చేస్తోంది. అంతటితో ఆగకుండా.. తమకు స్వీయరక్షణ సామర్థ్యం ఉందని ఐక్యరాజ్యసమితికి కూడా కుండబద్దలు కొట్టింది. దీంతో యుద్ధం నుంచి ఎగ్జిట్ ఎలాగో ట్రంప్‌నకు దిక్కుతోచటం లేదు.

యుద్ధంలో త్వరాగ పైచేయి సాధించాలనుకున్న అమెరికా, ఇజ్రాయెల్ కలల్ని ఇరాన్ కల్లలు చేసింది. ఆ రెండు దేశాల కంటే ఆయుధాలు, సైన్యం పరంగా బలహీనంగా ఉన్నా.. మానసిక యుద్ధంలో బలమైన ప్రతిఘటన ఇస్తోంది. ఇరాన్ యుద్ధవ్యూహాలు అన్ని దేశాల్నీ ఆశ్చర్యపరుస్తాయనడంలో సందేహం లేదు. మొదట్లో ఇరాన్ గల్ఫ్‌ దేశాలపై దాడులు చేసి.. హర్మూజ్‌ను బిగబట్టి బ్లాక్‌మెయిల్ యుద్ధం చేస్తోందనే భ్రమలు ప్రచారమయ్యాయి. కానీ యుద్ధంలో రోజులు గడిచేకొద్దీ.. ఇరాన్ ప్రతిఘటనను ఒప్పుకోవటమే కాదు.. తట్టుకోలేని స్థితిలో ఉన్నామని అమెరికానే పరోక్ష సంకేతాలు ఇవ్వక తప్పలేదు. ఇప్పటికే యుద్ధంలో అమెరికా సైన్యం గురించి ఇరాన్ చేస్తున్న ప్రకటనలు అగ్రరాజ్యంలో కలకలం రేపుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఖాళీగా కనిపిస్తున్నాయని, వారు పౌర ఆవాసాల్లో దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, వారికి ఆశ్రయం ఇచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గల్ఫ్ పౌరులకు ఇరాన్ జారీ చేస్తున్న హెచ్చరికలు దుమారం రేపుతున్నాయి. నిజం అమెరికా సైన్యం స్థావరాలు వీడిందా.. లేదా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఇరాన్ తప్పుడు ప్రకటనలు మాత్రమే అని యూఎస్ ఖండిస్తున్నా.. ట్రంప్ నేతృత్వంలో ఆ దేశం మాత్రం నిజాలు చెబుతుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

ఇరాన్ దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసుకున్న బలమైన వ్యవస్థలు.. ఆ దేశం ముందుజాగ్రత్తగా తయారుచేసుకున్న ఆయుధాలు ఇప్పుడు దానికి సురక్షాకవచంగా మారాయి. పైగా రహస్య వ్యూహాలు, ఇప్పటివరకు బయటి ప్రపంచానిక తెలియని మిస్సైల్ సిటీలు.. ఇరాన్ పోరాట సామర్థ్యానికి ప్రబల నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధంలో ఇరాన్ సరికొత్త ఆయుధాల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సీ మైన్ల భయంతో అమెరికా యుద్ధనౌకలు కూడా అల్లాడిపోతున్నాయి. ఇక తక్కువ ఖర్చుతో ఇరాన్ తయారుచేసిన డ్రోన్లు.. ప్రత్యర్థులకు కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కేవలం డ్రోన్లతోనే ఎయిర్‌ఫోర్స్‌ లేని కొరత తీర్చుకుంటున్న ఇరాన్.. అటు సరైన నేవీ లేకపోయినా.. ప్రపంచ దేశాల యుద్ధనౌకల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

యుద్ధం ఎన్నిరోజులైనా చేయగలిగే సామర్థ్యం తమకు ఉందని ప్రకటించిన ఇరాన్.. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని ట్రంప్‌నకు కుండబద్దలు కొట్టింది. అలాగే ఖమేనీని చంపేసిన నెతన్యాహుని ప్రశాంతంగా ఉండనిచ్చేది లేదని తొడగొట్టింది. ఇరాన్ తీరు చూస్తుంటే.. పశ్చిమాసియా మొత్తాన్ని టేకోవర్ చేసే ఉద్దేశం కనిపిస్తోందని స్వయంగా ట్రంపే సెలవిచ్చారు. ఆ స్థాయిలో దూకుడు చూపిస్తున్న ఇరాన్.. చివరకు సంక్షోభానికి ముగింపు పలకాలని ప్రపంచమే బతిమాలుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా చర్చల ప్రతిపాదన తోసిపుచ్చిన ఇరాన్.. ట్రంప్ జీర్ణించుకోలేని షరతులతో ఎగ్జిట్ గేమ్‌ను రసవత్తరంగా మార్చేసింది.

ఓవైపు యుద్ధం.. మరోవైపు వ్యూహం.. ఇలా అన్నిరకాలుగా పైచేయి సాధిస్తున్న ఇరాన్.. కీలక సమయంలో శత్రుదేశాల్ని మాత్రమే భయపెడుతూ.. మిత్రదేశాలపై ఔదార్యం చూపడం కూడా ప్రపంచానికి తమ వాదన సమర్థంగా వినిపించే ప్రయత్నమే అనడంలో సందేహం లేదు. తమను యుద్ధ బాధిత దేశంగా చూపించుకుంటూనే.. పిల్లిని కూడా గదిలో పడేసి కొడితే పులౌతుందని మరోసారి నిరూపిస్తోంది ఇరాన్. దీంతో జగమొండిగా మారిన ఇరాన్‌ను ఎల హ్యాండిల్ చేయలో తెలియక ట్రంప్ తలకొట్టుకుంటున్నారు. ఎక్కడో ఎవరో మొదలుపెట్టిన యుద్ధాల్ని ఆపానని గొప్పలు చెప్పుకున్న ట్రంప్.. తాను ప్రారంభించిన యుద్ధాన్ని ఆపలేక.. ఇరాన్‌ను కన్విన్స్ చేయలేక.. ఆపసోపాలు పడుతున్నారు.

అంతిమంగా ఇరాన్ యుద్ధంలో ఒక్క విషయం పూర్తిగా తేలిపోయింది. ఇక అమెరికా ఇరాన్‌లో క్షిపణి ప్రయోగించే స్థితిలో లేదు. అలాగని వెనకడుగు వేద్దామన్నా.. అది సురక్షితంగా జరుగుతుందనే నమ్మకంతోనూ లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి దుస్థితిని తనకు తానుగా తెచ్చుకున్న ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ ఉచ్చులో ఇరుక్కుని విలవిల్లాడుతున్నారు. ఇరాన్ దెబ్బ ట్రంప్‌ను అనేకరకాలుగా ఇబ్బంది పెడుతోంది. మొన్నటివరకూ సర్వశక్తివంతుడిగా కలర్ ఇచ్చిన ట్రంప్.. ఇఫ్పుడు అమెరికా చరిత్రలోనే అత్యంత బలహీన అధ్యక్షుడిగా మిగిలిపోతానేమోనని హడలిపోతున్నారు. ఇప్పటివరకు అమెరికా ఏ యుద్ధం చేసినా.. పూర్తి నియంత్రణ తీసుకునేది. కావాలనుకున్నప్పుడు యుద్ధం ముగించే మార్గం తన చేతిలోనే ఉంచుకునేది. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం ఇరాన్‌లో నెతన్యాహు మొహమాటంతో రంగంలోకి దిగి.. దిక్కుతోచని స్థితిలోకి జారుకున్నారు. పైగా తాను దాడులకు విరామం ఇచ్చినా.. ఇజ్రాయెల్ పట్టించకుకోండా యుద్ధం కొనసాగించడం కూడా ట్రంప్‌నకు తల కొట్టేసినట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడ అమెరికా మాట ఇజ్రాయెల్ వినాలా.. ఇజ్రాయెల్ మాట అమెరికా వినాలా అనే తర్కంతో ట్రంప్ మతిపోతోంది. అసలు ఈ కోణమే అమెరికాలో ట్రంప్‌పై వ్యతిరేకతను పెంచుతుందనడంలో సందేహం లేదు.

సైన్యం మాట పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ట్రంప్‌.. ఇప్పుడు నిస్సహాయంగా దిక్కులు చూస్తున్నారు. యుద్ధం కొనసాగించటానికే కాదు.. విరమణకూ మార్గం తెలియని అయోమయంలో పడిపోయారు. ఈ స్థితిని ఇరాన్ అడ్వాంటేజ్ తీసుకుని.. ట్రంప్‌నకు మరిన్ని ఉచ్చులు పన్నుతోంది. పరిస్థితి చూస్తుంటే.. చివరకు చర్చల కోసం కూడా ఇరాన్‌ను ట్రంప్ బతిమాలుకోవాలేమో అనే సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధంలో నాలుగు వారాలు గడిచాయి. ఐదో, ఆరో వారానికి వచ్చేసరికి.. ట్రంప్ కావాల్సినన్ని మెట్లు దిగొచ్చి.. ఇరాన్ షరతులకు ఒప్పుకుంటారేమోననే సందేహాలు వస్తే.. అది వచ్చినవారి తప్పు కానే కాదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఒక...

Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత మరింత తీవ్ర రూపం...

Iran Strikes Kuwait: కువైట్ పోర్టుపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!

Iran Strikes Kuwait: ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఆపరేషన్ ట్రూ...

Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ Polo EV లీక్.. లాంచ్‌కు ముందే కార్ డిటైల్స్..

Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ పోలో, కార్ లవర్స్‌‌లో ఈ...