దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ దాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన భౌతిక సరిహద్దుల్లోనే కాక, డిజిటల్ రంగంలో కూడా ఉద్రిక్తతలను రగిల్చింది. పాకిస్థాన్ హ్యాకర్లు భారత రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడుతూ, దేశ రక్షణ వ్యవ్యస్థకి సవాలు చేస్తున్నారు. అయితే, భారత సైబర్ రక్షణ ఏజెన్సీలు ఈ దాడులను దీటుగా ఎదుర్కొంటూ, దేశ భద్రతను కాపాడుతున్నాయి.
Read More: Pakisthan: పాక్ కవ్వింపు.. 120 కిమీ రేంజ్ క్షిపణి ప్రయోగించిన పాకిస్తాన్
సోమవారం జరిగిన ఒక సైబర్ దాడిలో, ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యాకర్ గ్రూప్ భారత సైనిక ఇంజనీరింగ్ సర్వీస్ (MES), మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (MP-IDSA)కు సంబంధించిన సున్నితమైన డేటాను దొంగిలించినట్లు ప్రకటించింది. ఈ హ్యాకర్లు రక్షణ సిబ్బంది వ్యక్తిగత సమాచారం, లాగిన్ వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంతటితో ఆగక, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (AVNL) అధికారిక వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో వెబ్‌సైట్‌పై పాకిస్థాన్ జెండా, ‘అల్ ఖలీద్’ ట్యాంక్ చిత్రాలను ప్రదర్శించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ దాడిని గమనించిన అధికారులు, భద్రతా కారణాల రీత్యా AVNL వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
Read More: Suhas : ఊరమాస్ లుక్ లో సుహాస్.. పోస్టర్ తోనే హైప్..
నష్టం ఎంతమేరకు జరిగిందో క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిపుణులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన భారత రక్షణ సంస్థలపై పాకిస్థాన్ సైబర్ దాడుల ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు భారత సైబర్ భద్రతా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో, భారత ప్రభుత్వం మరియు సైబర్ రక్షణ ఏజెన్సీలు దేశ డిజిటల్ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. సైబర్ దాడుల నుంచి కీలకమైన సమాచారాన్ని కాపాడటంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి దాడులను నిరోధించేందుకు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.