Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ చంపేశారు. ఈ దాడిలో 28 మంది మరణించారు. దాడికి సంబంధించిన కార్యాచరణ మొత్తం దాయాది దేశం పాకిస్తాన్ జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కరాచీ, పీఓకేలోని ముజఫరాబాద్‌తో దాడికి సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.
మరోవైపు, ఈ రోజు సౌదీ పర్యటనను రద్దు చేసుకుని ఇండియా తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, ఉదయం నుంచి అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు రాజ్‌నాథ్ సింగ్ కూడా సైన్యాధ్యక్షుడితో, కీలక అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మరో సర్జికల్ స్ట్రైక్ లేదా ఎయిర్ స్ట్రైక్ జరిగే అవకాశాలు ఉన్నాయని, పాకిస్తాన్ పై ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పహల్గామ్ దాడిలో తమ ప్రమేయం లేదని చెబుతూనే, భారత సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఇప్పటికే, పాక్ ఆర్మీ సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించినట్లు సమాచారం. పాక్ వైమానిక దళం పూర్తిగా హై అలర్ట్‌లో ఉంది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2016లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై మరియు 2019లో బాలాకోట్ టెర్రరిస్ట్ క్యాంపులపై సర్జికల్ దాడులు చేసింది. దీంతో, ఈ దాడికి కూడా భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తన యుద్ధవిమానాలను సిద్ధం చేసింది. సైన్యంతో పాటు పాక్ ఐఎస్ఐ అప్రమత్తమైంది. కరాచీ, రావల్పిండి, లాహోర్ ఎయిర్ బేస్‌ల నుంచి పాక్ వైమానిక దళం అసాధారణ కదలికలు నమోదయ్యాయి.