ఇటీవలి కాలంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహిళా జట్టు విషయంలో, ఇప్పుడు ఐపీఎల్ 2025 టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తాజాగా మరోసారి హెచ్‌సీఏ పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో హెచ్‌సీఏ సమస్య ఎదుర్కొంటోంది. స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ విచారణ జరిపిన అనంతరం అంబుడ్స్‌మన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు అజహరుద్దీన్ తన పేరును స్టాండ్‌కు పెట్టించడం సరైంది కాదని, అందులో విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇకపై స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు ఉండకూడదని, మ్యాచ్‌ల కోసం విక్రయించే టిక్కెట్లపై కూడా అజారుద్దీన్ ప్రస్తావన లేకుండా చూడాలని హెచ్‌సీఏను ఆదేశించారు.
Also Read: Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు వీరే!
2012లో వీవీఎస్ లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యారు. లక్ష్మణ్ గౌరవార్థం ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్‌కు ఆయన పేరు పెట్టారు.7 సంవత్సరాల తర్వాత 2019లో మహ్మద్ అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు.. ఈ స్టాండ్‌ను తన పేరుపై మార్చారు. స్టాండ్‌కు తన పేరు పెట్టడానికి అజారుద్దీన్ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అపెక్స్ కౌన్సిల్‌లో భాగమైన అజారుద్దీన్.. స్టాండ్ పేరు మార్చడానికి ఓటు వేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం.