మూల విరాట్‌కే దిక్కులేక ఓ మూలన ఉంటే…. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగిందన్నది సామెత. ఇప్పుడక్కడ కారు పార్టీ పరిస్థితి అచ్చుగుద్దినట్టు అలాగే ఉందట. పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… పాదయాత్ర చేశామా? లేదా? అన్నదే ముఖ్యం అంటూ కొందరు జూనియర్స్ చెలరేగిపోతుంటడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సమ్మర్ సెగల్ని మించిన రేంజ్‌లో వర్గపోరు ఎక్కడ జరుగుతోంది? ఏంటా కథ? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ లీడర్స్ కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారట. ప్రేమగా కౌగిలించుకుంటూనే… పొలిటికల్ పోట్లు పొడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ లీడర్స్ కొందరు కొంత కాలంగా ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారని, తాజాగా రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు అగ్గికి ఆజ్యం పోశాయని చెప్పుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. తమ బలం, బలగాన్ని నిరూపించుకుని పైచేయి సాధించేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట ఇరు వర్గాల నాయకులు. ఇందులో భాగంగానే వరుస పాదయాత్రలు జరుగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా… యాదాద్రి జిల్లాలో పాదయాత్రలు జోరందుకోవడంతో…. కేడర్ ఉత్సాహంగా కనిపిస్తున్నా… అవి నాయకుల బలప్రదర్శనలకు వేదిక అవుతున్నాయన్న కంగారు పెరుగుతోందట. పోటాపోటీగా పాదయాత్రలు జరుగుతున్నాయి సరే…. అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నా…. పక్క వాళ్ళ యాత్రకు వెళ్ళవద్దని, మాతోనే రావాలని కొందరు నాయకులు వత్తిడి చేస్తుండటంతో… ఇదెక్కడి గొడవరా… నాయనా… అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు. ఈ ఆదేశాలు, వివాదాలతో కారు పార్టీలో సెగలు పుడుతూ… సమ్మర్ హీట్‌ని మించిపోతున్నాయంటున్నారు. వరుస పాదయాత్రలతో… ఇన్నాళ్లు నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు ఇప్పుడు రోడ్డెక్కిందన్న చర్చ జరుగుతోంది బీఆర్‌ఎస్ కేడర్‌లో.
రజతోత్సవ సభ విజయవంతానికి నియోజకవర్గ స్థాయిలో క్యాడర్‌ని కదిలించమని అధినేత, యువనేత దిశానిర్దేశం చేస్తే…. కొందరు లీడర్లు మాత్రం నియోజకవర్గాన్ని దాటి చేస్తున్న బలప్రదర్శన తలనొప్పిగా మారుతోందని అంటోంది కేడర్. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు చేపట్టిన పోటాపోటీ పాదయాత్ర వెనక కొందరు కీలక నేతల ప్రమేయం ఉందని, అంతా వాళ్ళే నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. వరంగల్ సభ విజయవంతానికి యాత్రలు చేసి జన సమీకరణ జరిపితే ఫర్లేదుగానీ… అవి ఆధిపత్య పోరుకు కేరాఫ్‌గా మారడమే అసలు సమస్య అంటున్నారు పార్టీ నాయకులు. నల్గొండ కారులో చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పంచాయతీ… ఇప్పటికే హైదరాబాద్ హెడ్డాఫీస్ మీదుగా… పార్టీ పెద్దల వద్దకు చేరిందట. అక్కడ కొన్నాళ్లు నలిగి పరిష్కారం లేకుండా తిరిగి జిల్లా వీధుల్లోకి వచ్చిందని అంటున్నారు బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కేంద్రంగా జరుగుతున్న ఈ యాత్రల వెనక ఉన్నది పూర్తిగా అధిపత్యపోరేనని, ఇందులో మరో మాటే లేందటున్నారు పరిశీలకులు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ఓ విధ్యార్ది నేత పాదయాత్ర నిర్వహిస్తే… వేములకొండ నుంచి యాదగిరిగుట్ట వరకు మరో స్టూడెంట్ లీడర్ మూడు రోజుల పాదయాత్ర చేశారు. వీటికి ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు నేతలు వెన్నుతట్టడంతో… గ్రూప్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పాదయాత్రలో నడిచేది విద్యార్దినేతలే అయినా… నడిపించేది మాత్రం వెనకున్న అదృశ్య శక్తులేనన్న చర్చ జరుగుతోంది నల్గొండ పొలిటికల్ సర్కిల్స్‌లో. పాదయాత్రలో పాల్గొనేందుకు క్యాడర్‌కు వేరువేరుగా పిలుపులు ఉండటంతో ఎటుపోతే ఎవరు హర్ట్ అవుతారో, ఏం ముప్పు ముంచుకు వస్తుందోనని ఆందోళపడుతున్నట్టు సమాచారం. తమ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందని ఫీలవుతున్న గులాబీ కేడర్‌కు ఎప్పుడు రిలీఫ్ వస్తుందో చూడాలి మరి.