CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరుస తుఫాన్ల విధ్వంసంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అర్నబ్ తుఫాన్ తెచ్చిన నష్టం నుంచి కోలుకోకముందే, వారం వ్యవధిలోనే మురసు తుఫాన్ రావడం రాష్ట్ర తీవ్రంగా దెబ్బతీసిందని సీఎం పేర్కొన్నారు. ఒకే సీజన్లో వరుసగా రెండుసార్లు తుఫాన్లు విరుచుకుపడటంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మురసు తుఫాన్ కారణంగా ప్రాథమికంగా రూ.1,919.59 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం అంచనా వేశారు. తుఫాన్ ధాటికి 1,43,122 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 1,86,063 మంది రైతులపై దీని ప్రభావం పడింది. దీంతో వ్యవసాయ రంగానికి రూ.874.96 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.337.10 కోట్ల నష్టం వాటిల్లింది. పంటలతో పాటు విద్యుత్, రహదారులు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్య, వైద్యారోగ్య రంగాల్లోనూ తీవ్రస్థాయిలో మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. బాధిత రైతులు, మత్స్యకారులు, కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి నష్ట నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని సీఎం వివరించారు.
ఇక, ఇది గడ్డు సంవత్సరం.. అర్నబ్ తుఫాన్‌తో పంటలు దెబ్బతిన్నాయి.. వరుసగా రెండు తుఫాన్లు రావడం చరిత్రలో మొదటి సారని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరులో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను శుక్రవారం సీఎం పరిశీలించారు. పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్లి బాధిత రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటల నష్టం అంచనా జరుగుతోందా అని ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అర్నబ్, మురసు తుఫాన్ లతో చాలా సమస్యలు వచ్చాయన్నారు. నీళ్ళు లేని పరిస్థితి ఏర్పాడిందని.. కృష్ణా నదికి వరద రాలేదన్నారు. పట్టిసీమ నీళ్ళ ద్వారా పంట సాగు చేశారని.. పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతిందని గుర్తు చేశారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ, ఆస్థి నష్టం తగ్గించామని చెప్పారు. రాయలసీమ రాళ్ళ సీమ.. ఆరేడు పెద్ద పెద్ద తుఫాన్లు చూశాను. ఇవి పాఠాలు నేర్పుతున్నాయన్నారు. మురసు ఎన్టీఆర్ జిల్లా నుండి ప్రకాశం వరకూ దెబ్బతీసిందని తెలిపారు. అకాల వర్షం, కుంభవృష్టి కురిసిందని.. 26 సెంమీ వర్షపాతం నమోదైందని స్పష్టం చేశారు.




