29
October, 2026

A News 365Times Venture

29
Thursday
October, 2026

A News 365Times Venture

Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?

Date:

Story Board: దేశంలో ఉత్తరాదికీ, దక్షిణాదికీ రాజకీయంలో కచ్చితమైన తేడా ఉంది. అందులోనూ దక్షిణాదిలో తమిళనాడు రాజకీయం తీరే వేరు. మొదట్నుంచీ ద్రవిడ భూమిపై సినీతారల రాజకీయమే కొనసాగుతోంది. అన్నాదురై, ఎంజీఆర్ మొదలుకుని.. కరుణానిధి, జయలలిత.. ఇప్పుడు విజయ్ దాకా అందరూ సీఎంలయ్యారు. వారి స్ఫూర్తితోనే ఇప్పుడు ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చూస్తుంటే తమిళనాడు రాజకీయ గతం, ప్రస్తుతమే కాదు.. భవిష్యత్తు కూడా సినిమాతోనే ముడిపడి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.

దక్షిణాదిన తొలి నుంచీ సినిమానటుల్ని ఆరాధ్యదైవాలుగా ఆరాధించే సంస్కృతి ఉంది. అందులోనూ తమిళనాడులో సినీ అభిమానం పీక్స్‌లో ఉంటుంది. అప్పట్లో ఎంజీఆర్ కాలం నుంచీ ఇప్పుడు విజయ్ దాకా అదే కొనసాగుతూ వచ్చింది. కాకపోతే రాబోయే రోజుల్లోనూ సినీతారలే తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని ఇప్పుడు తేలిపోయింది. ఉన్నట్టుండి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ధనుష్ ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేయలేదు. కానీ అభిమాన సంఘాలతో మీటింగ్, అభిమానులకు కానుకల పంపిణీతో.. ఆయన తన అసలు ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పేశారు. మహిళా అభిమానులకు వెండి కుంకుమ భరిణల పంపిణీతో ధనుష్ సూటిగా సుత్తిలేకుండా రాజకీయ వర్గాలకు సంకేతాలు పంపారని చెబుతున్నారు.

అసలు తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాయి. అక్కడ సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు. ఇప్పటికీ పోషిస్తున్నారు. ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్‌ పొలిటికల్ ఎంట్రీకి ముందు.. సినీ నటుల హవా కాస్త తగ్గినట్టు అనిపించింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనంతో.. తమిళ తంబీలకు సినిమా మోజు తగ్గలేదని రుజువైపోయింది. దీంతో అప్పటిదాకా రాజకీయాల్లోకి రావాలా.. వద్దా అనే ద్వైదీభావంలో పడ్డ కోలీవుడ్ స్టార్లకు.. విజయ్ విజయం కొత్త ఊపిరి పోసింది. అందుకే ఇప్పుడు ధనుష్ లాంటి వాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని విజయ్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే కొన్నాళ్లుగా రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. విజయ్ తండ్రి ఒక రాజకీయ పార్టీని స్థాపించడంతోపాటు కొన్ని ఎన్నికల్లో కూడా పోటీచేశారు. పీపుల్స్ మూమెంట్ అనే సంస్థ ద్వారా 10 12వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్ కొంతకాలంగా అవార్డులు ఇస్తూ వస్తున్నారు. చాలా కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విజయ్ జోసెఫ్ తన పొలిటికల్ పార్టీని ప్రకటించారు. నిజానికి 2021 ఎన్నికల్లోనే విజయ్ రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ విజయ్ తండ్రి అప్పట్లో కొన్ని పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉండటంతో తన తండ్రికి తన పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదంటూ విజయ్ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. కానీ ఇటీవల విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి అంతా సిద్ధం చేసుకుని ఎన్నికల సంఘం దగ్గర పార్టీని రిజిస్టర్ చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన చేశారు.

ఇక్కడ కేవలం పొలిటికల్ ఎంట్రీ మాత్రమే జరిగిఉంటే.. విజయ్ ప్రత్యేకత ఏమీ ఉండేది కాదు. అంతేకాదు మిగతా స్టార్లు కూడా అంత ఉత్సాహపడేవారు కాదు. ఎందుకంటే తమిళనాడులో దశాబ్దాలుగా రాజకీయాల్లో సినీతారల హవా నడుస్తున్నా.. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తర్వాత మరికొందరు సినీనటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా.. వారెవరూ పవర్ దరిదాపుల్లోకి రాలేకపోయారు. దీంతో కొంతమంది నటులు రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరి కూడా తర్వాత వెనక్కితగ్గారు. ముఖ్యంగా కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటివారికి పాలిటిక్స్ కలిసిరాకపోవడం, సూపర్ స్టార్ రజినీకాంత్ చివరిదాకా నాన్చి.. ఆఖరి నిమిషంలో పాలిటిక్స్‌కు ఖో చెప్పడం చూసి.. కోలీవుడ్ స్టార్లంతా అప్రమత్తమయ్యారనే చెప్పాలి. కానీ అలాంటివారందరికీ మొన్నటి విజయ్ విజయంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అప్పటిదాకా తమిళ జనానికి సినీనటుల మీద మోజు తగ్గిందేమో అన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది. నిజానికి ధనుష్‌పాటు మరికొందరు నటుల రాజకీయ అరంగేట్రం గురించి కూడా ఊహాగానాలు వచ్చినా.. ప్రస్తుతానికి ధనుష్ మాత్రమే తొలి అడుగు వేశారు.

విజయ్ రాజకీయ ఎంట్రీ తర్వాత ఆయన విషయంలో వ్యూహాత్మకంగా జరిగిన తప్పు.. ఇప్పుడు ధనుష్ విషయంలో జరగకూడదని తమిళనాట ద్రవిడ పార్టీలు అప్పుడే అప్రత్తమౌతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ పంచిన వెండి కుంకుమ భరిణెలపై ఉన్న కమలం పువ్వు గుర్తులతో రాజకీయ కాక రేగింది. దానికి, రాజకీయంతో సంబంధం లేదని ధనుష్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినా.. ఇప్పుడు ధనుష్‌ను తమ పార్టీలో చేర్చుకోవాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ధనుష్ కొత్త పార్టీ పెట్టేముందే. ఆయన్ను తమవైపు ఆకర్షిస్తే.. రాజకీయ లబ్ధి ఖాయమని పళనిస్వామి లెక్కలేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంత అనే సంగతి పక్కనపెడితే.. తమిళనాడు రాజకీయాల్లో సినీనటులు ఏ స్థాయిలో అలజడి రేపుతున్నారనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు.

మొత్తం మీద కాస్త గ్యాప్ తర్వాత తమిళ రాజకీయాల్లో సినీ నటుల హవాకు విజయ్ తెరలేపడంతో.. ఇక ఈ వెల్లువ ధనుష్ నుంచి ఇంకా ఎంతమందికి చేరుతుంది..?అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే ఆరు దశాబ్దాలుగా తమిళనాడులో ద్రవిడ రాజకీయం చూసిన తమిళులు విసుగెత్తిపోయారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జెన్‌జీకి ఈ పాత చింతకాయ పచ్చడి అసలే నచ్చడం లేదు. ఈ యువత అభిమానంతోనే విజయ్‌ అతి పెద్ద విజయం సాధించారనే విశ్లేషణలు ఇప్పటికే వచ్చాయి. అయితే మొన్న ఎన్నికల్లో అంటే విజయ్ రాజకీయాలకు కొత్త. కానీ ఇప్పుడు ఓ టర్మ్ అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత తప్పదని, అప్పుడూ తమకూ ఛాన్స్ ఉంటుందని కొందరు సినీ స్టార్లు లెక్కలేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఏతావాతా ద్రవిడ పార్టీలు బలహీనపడటం, విజయ్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం లేదనే భావనే.. ధనుష్ లాంటి స్టార్లను పొలిటికల్ ప్లాన్స్‌కు పురిగొల్పుతోందనడంలో ఆశ్చర్యమేం లేదు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ

GITAM University: యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’...

OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!

OTR: ఏపీలో మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఒక ఎత్తు, ఆ...

Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!

Off The Record: వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఆ...

AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?

AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు...