CM Revanth Reddy: తెలంగాణలో పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. అధికారులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ పరిస్థితిలో ఎందుకు మార్పు రావడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించబోనని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని ఎందుకు పెంచడం లేదని సీఎం అధికారులను నిలదీశారు. బొగ్గు కొరత రాకుండా నైనీ, మహానది నుంచి బొగ్గు లింకేజీ ఏర్పాట్లు చేసినప్పటికీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్లో సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా విషయంలో సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో వెంటనే వివరించాలని ఆదేశించారు.
రైతులకు విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంపై సీరియస్
పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా అధికారులు పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది తానేనని, అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. రైతులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించబోనని తేల్చిచెప్పారు. విద్యుత్ శాఖలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అవసరమైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జెన్కో సీఎండీపై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు గల కారణాలను వెంటనే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితిని సమీక్షించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..




