Honor Win 2 Series: హానర్ (Honor) నుండి కొత్త Win 2 సిరీస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను చైనాలో అక్టోబర్ 21న అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Honor Win 2, Win RT 2, Win Turbo 2 వంటి మోడళ్లు ఉన్నాయి. లాంచ్‌కు ముందే ఈ మూడు ఫోన్లు హానర్ చైనా ఆన్లైన్ స్టోర్‌లో లిస్ట్ అయ్యాయి. దీంతో వాటి డిజైన్, కలర్ ఆప్షన్లు, కొన్ని కాన్ఫిగరేషన్లు వెల్లడయ్యాయి.
ఈ సిరీస్‌లో Honor Win RT 2 ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. ఈ ఫోన్లో 185Hz రిఫ్రెష్ రేట్‌తో 2K AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది చాలా సన్నని బెజెల్స్‌తో స్క్రీన్ వస్తుందని సమాచారం. ఇందులో Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్, వేడిని నియంత్రించేందుకు ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే డ్యూయల్ 1216 సిమెట్రికల్ స్పీకర్లు ఉండనున్నాయి.
అయితే ఈ ఫోన్లో అందరినీ ఆకట్టుకునే ఫీచర్ మాత్రం బ్యాటరీ. ఏకంగా 12,070mAh భారీ బ్యాటరీతో Win RT 2 రానుంది. 3C సర్టిఫికేషన్ ప్రకారం దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ సామర్థ్యం మెయిన్‌స్ట్రీమ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలోనే అత్యంత పెద్దదిగా నిలిచే అవకాశం ఉంది. Honor Win RT 2ను 12GB+256GB, 16GB+256GB, 12GB+512GB, 16GB+512GB వేరియంట్లలో తీసుకురానున్నారు. ఇక Win Turbo 2 కూడా ఇవే కాన్ఫిగరేషన్లతో పాటు 8GB+256GB బేస్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది. Win Turbo 2 స్పెసిఫికేషన్లపై ప్రస్తుతం పూర్తి సమాచారం లేదు.
ఈ సిరీస్‌లో ప్రీమియం మోడల్‌గా భావిస్తున్న Honor Win 2 కూడా 2K రిజల్యూషన్, 185Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. Win RT 2, Win 2 రెండింటిలోనూ దాదాపు 6.89 అంగుళాల స్క్రీన్ ఉండనున్నట్లు సమాచారం. ఇందులో Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్సెట్ ఉండొచ్చని సమాచారం. అలాగే 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. RAM, స్టోరేజ్ పరంగా Win RT 2లోని వేరియంట్లతో పాటు అదనంగా 16GB+1TB వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది.
Win RT 2, Win Turbo 2 ఫోన్ల అధికారిక చిత్రాల్లో Red and Blue Buff, Quickly Star Black, Designated Win వంటి కలర్ ఆప్షన్లు కనిపించాయి. Win 2 కూడా Red and Blue Buff, Quick Black, Guaranteed Win వంటి రంగుల్లో రానున్నట్లు సమాచారం.
అక్టోబర్ 21న చైనాలో ఈ మూడు ఫోన్లను హానర్ అధికారికంగా విడుదల చేయనుంది. లాంచ్ సమయంలో ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు, కెమెరా వివరాలు వంటి మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




