Mobile Phone Blast: పిడుగుపాటు కారణంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్లూరు మండలం గాండ్లపాడు గ్రామ శివారులో పిడుగుపాటుకు విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి చరణ్ మృతి చెందాడు. కోమటికుంట్ల సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న చరణ్.. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన గాండ్లపాడుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది..
వివరాల ప్రకారం.. వర్షం కురుస్తుండటంతో చరణ్ వర్షం నుంచి తప్పించుకునేందుకు ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడటంతో చరణ్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చరణ్‌తో పాటు సమీప బంధువు దేవనందు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పిడుగుపాటు ధాటికి చరణ్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చరణ్ 2019 నుంచి విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చరణ్ మృతితో గాండ్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మరోసారి వర్షాలు, పిడుగులపై వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు వర్షం, పిడుగుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




