ఊహించని రీతిగా జలప్రళయం వచ్చి ఎందరో సర్వం కోల్పోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆత్మీయుల జాడ తెలియక ఎందరో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ వీడియోలను చూసిన వారి గుండెలు కూడా తరుక్కుపోతున్నాయి. చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టుగా నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు దుశ్చర్యకు పాల్పడుతున్నారు. జలప్రళయంలో కొట్టుకువచ్చిన మృతదేహాలపై బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మృతదేహం నుంచి బంగారు చెవి దిద్దులను ఇద్దరు వ్యక్తులు తొలగిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. బుధవారం టిబెట్‌లో కొండచరియలు విరిగిపడటంతో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల ధాటికి కొట్టుకుపోయిన ఓ మృతదేహం నారాయణి నదిలోకి చేరినట్లు సమాచారం. ఈ మృతదేహం నుంచి ఇద్దరు వ్యక్తులు బంగారు చెవి దిద్దులను తీస్తున్నట్లు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన చిత్వన్ పోలీసులు.. గురువారం భరత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ-1లోని పోఖారా బస్ పార్క్ సమీపంలో ఇద్దరు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పలు మీడియా సంస్థలు జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నాయి. పోలీసులు అరెస్ట్ చేసిన వారిని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీగా గుర్తించారు. మదన్ గురుంగ్ నావల్‌పరాసి జిల్లాలోని బినయి త్రివేణి రూరల్ మున్సిపాలిటీకి చెందిన వ్యక్తిగా.. ప్రస్తుతం భరత్‌పూర్‌లో తన మేనమామ దగ్గర ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ఉమేశ్ చౌదరీ సున్సారీ జిల్లాలోని చాంద్‌బేలా మున్సిపాలిటీకి చెందినవాడని.. ప్రస్తుతం భరత్‌పూర్‌లో నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరినీ తదుపరి దర్యాప్తు కోసం చిత్వన్ జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు.
అమానవీయ చర్యలను సహించం
విపత్తు బాధితులు, మృతుల విషయంలో దోపిడీ లేదా ఇతర అమానవీయ చర్యలను ఏమాత్రం సహించబోమని చిత్వన్ పోలీసు చీఫ్ ఎస్పీ రమేశ్వర్ పౌడెల్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. భారీ వరదల అనంతరం నారాయణి, త్రిశూలి నదుల ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటూ.. వాటిని గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో మృతుల దగ్గర ఉన్న విలువైన వస్తువులను కొందరు తొలగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు నిఘాను మరింత పెంచారు. వరద బాధితుల మృతదేహాల నుంచి వస్తువుల చోరీ, దోపిడీ లేదా ఇతర అమానవీయ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం, ఆధారాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చిత్వన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Two men were arrested in Nepal after viral video showed them stealing gold earrings from the body of a flood victim carried downstream by the devastating Bhotekoshi flood.
Police identified them from the video and detained them in Bharatpur. pic.twitter.com/azoJ88202B
— Clash Report (@clashreport) August 27, 2026




