Student Success: పాకెట్లో రూ. 1,000, చేతిలో పాత లాప్టాప్.. ఈ రెండింటితోనే 14 ఏళ్ల వయసులో ఆ బీహార్ కుర్రాడు ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టాడు. తనకున్న పరిమితులకు మించిన భవిష్యత్తును వెతుక్కుంటూ బయలుదేరిన ఆ చిన్నారి ప్రయాణం, ఈరోజు ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు కోటాలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి కూడా డబ్బులు లేక వెనుతిరిగిన ఆ కుర్రాడే, నేడు రూ. 3.5 కోట్ల గ్లోబల్ స్కాలర్షిప్ సాధించి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అతడే బీహార్‌లోని చంపారణ్ జిల్లా మోతీహరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఆదర్శ్ కుమార్.
జీవితంలో ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవడం ఆదర్శ్ ప్రత్యేకత. కోచింగ్ చేరే వీలు లేకపోవడంతో నిరాశపడకుండా.. క్షేత్రస్థాయి ప్రాజెక్టులు, స్టార్టప్‌లతో ప్రయోగాలు చేశాడు. విద్యార్థులకు అవసరమైన స్కిల్స్, మెంటార్షిప్, అవకాశాలను అందించే లక్ష్యంతో ‘స్కిల్జో’ (Skillzo) అనే ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దాదాపు 20,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఒకవైపు స్కిల్జోను నడుపుతూనే.. మరోవైపు గూగుల్ యూత్ అడ్వైజర్‌గా, అంతర్జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో భాగస్వామిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే 148 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11,000 నామినేషన్లను దాటుకుని, ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ 2025’ గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.
అయితే ఈ విజయం వెనుక ఉన్న ప్రయాణం సులువుగా ఏమీ సాగలేదు. విదేశాల్లో చదువుకోవాలనే కల నెరవేర్చుకునేందుకు అప్లై చేస్తే.. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 22 విశ్వవిద్యాలయాల నుంచి తిరస్కరణలు (Rejections) ఎదురయ్యాయి. అడ్మిషన్ల సాధారణ గడువు ముగిసిపోయి, దారులన్నీ మూసుకుపోయిన వేళ.. కార్నెల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని జోన్ ల్యూ నడుపుతున్న ‘సెకండ్ ఛాన్స్’ సంస్థ ఆదర్శ్‌కు ఆసరాగా నిలిచింది. ఖతార్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీతో ఉన్న ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా ఆదర్శ్ ప్రొఫైల్‌ను పరిశీలించాల్సిందిగా జోన్ విజ్ఞప్తి చేశారు. ఆ ఒక్క మినహాయింపే ఆదర్శ్ జీవితాన్ని మలుపు తిప్పింది.
అమ్మతో కలిసి ఇంట్లో కూర్చున్న సమయంలోనే జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి ఈ అద్భుతమైన ఈమెయిల్ వచ్చింది. ట్యూషన్ ఫీజు, వసతి, భోజనం, విమాన టికెట్లు, వీసా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని ఖర్చులనూ భరించే రూ. 3.5 కోట్ల పూర్తి స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్ లెటర్ అది. ఈ వార్త వినగానే తీవ్ర భావోద్వేగానికి గురైన ఆదర్శ్, ఆ సంతోషాన్ని తండ్రి లేని తనను కష్టపడి పెంచిన తల్లితోనే మొదట పంచుకున్నాడు. ఖతార్‌లోని ‘ఎడ్యుకేషన్ సిటీ’లో ఉన్న ఈ యూనివర్సిటీలో 70కి పైగా దేశాల విద్యార్థులతో కలిసి ఆదర్శ్ పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవబోతున్నాడు. తన సొంత రాష్ట్రమైన బీహార్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన అనుభవాలు, స్కిల్జో ద్వారా చేసిన సామాజిక సేవ అతడికి పాలసీల ప్రాముఖ్యతను బోధించాయి. అందుకే కేవలం ఒక వ్యక్తిగత విజయంగా మిగిలిపోకుండా.. విద్య, ఉపాధి, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక మార్పులు తెచ్చేలా పాలసీలు, గ్లోబల్ గవర్నెన్స్ రంగాల్లో పనిచేయాలని భావిస్తున్నాడు. ఈ ప్రయాణంలో భాగంగా వాషింగ్టన్ డిసి, ఇటలీ క్యాంపస్‌లలో కూడా చదివే అవకాశాలను పరిశీలిస్తున్నాడు.
ఈ విజయం తర్వాత బీహార్ గవర్నర్, విద్యాశాఖ మంత్రి వంటి ప్రముఖులు అతడిని అభినందించారు. అయితే చిన్న పట్టణాలు, పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆదర్శ్ ఇచ్చే సందేశం ఒక్కటే.. “ఎలాంటి పరిమితులూ లేవు, మిమ్మల్ని మీరే రిజెక్ట్ చేసుకోకండి.” అని చెబుతున్నాడు. తిరస్కరణలు ఎదురైనా ప్రయత్నించడం ఆపవద్దని, అందుబాటులో ఉన్న అవకాశాలతో చిన్నగా మొదలుపెట్టి పెద్ద కలల కోసం పోరాడాలని చెప్తున్నాడు. పాకెట్లో వెయ్యి రూపాయలతో మొదలైన ఆదర్శ్ ప్రయాణం నిరూపించిన సత్యం ఒకటే.. తలుపు వెతకడం కష్టమే కావచ్చు, కానీ అసలు తలుపే లేదనుకోవడం మాత్రం పొరపాటే!




