India Test Cricket History: భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. 1932లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు 600వ టెస్టు మ్యాచ్ ఆడుతుంది. శ్రీలంకతో గాలే వేదికగా జరిగే మ్యాచ్‌తో భారత్ ఈ ఘనత సాధించింది. దీనితో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత 600 టెస్టులు పూర్తి చేసిన మూడో జట్టుగా భారత్ చరిత్ర సృష్టించనుంది.
భారత్ 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడింది. అక్కడి నుంచి 100 టెస్టుల మైలురాయిని చేరుకోవడానికి భారత్‌కు ఏకంగా 35 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాతి 100 టెస్టులకు 15 సంవత్సరాలు, 300 నుంచి 400 టెస్టులకు చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మాత్రం భారత జట్టు వేగం బాగా పెరిగింది. దాదాపు ప్రతి పదేళ్లకు 100 టెస్టులు పూర్తి చేస్తూ వచ్చింది.
టెస్టులు ఆడడమే కాదు.. గెలుపు కూడా..
టెస్టు మ్యాచ్‌ల సంఖ్య పెరిగిన కొద్దీ భారత జట్టు విజయాల శాతం కూడా బాగా మెరుగుపడింది. తొలి నాలుగు 100 టెస్టుల దశల్లో భారత్ మూడింట ఒక వంతు మ్యాచ్‌లను కూడా గెలవలేకపోయింది. అయితే ఐదో, ఆరో 100 టెస్టుల దశల్లో విజయాల సంఖ్య వరుసగా 42, 56కి పెరిగింది. భారత్ తొలి 300 టెస్టుల్లో సాధించిన విజయాల సంఖ్య 56. ఇదే సంఖ్యను ఇటీవల పూర్తి చేసిన 100 టెస్టుల దశలోనే భారత్ సాధించింది. అయితే ఈ సమయంలో భారత్ 31 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. డ్రా మ్యాచ్‌ల సంఖ్య తగ్గడంతో ఫలితాలు రావడం ప్రారంభమైంది.
సొంత గడ్డపై భారత్..
గత రెండు దశాబ్దాల్లో భారత్ టెస్టు క్రికెట్‌లో ఎదిగిన ప్రధాన కారణాల్లో సొంత గడ్డపై సాధించిన విజయాలు ఒకటి. ఇటీవలి 100 టెస్టుల దశలో భారత్ స్వదేశంలో 50 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఏకంగా 35 మ్యాచ్‌లు గెలిచింది. కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. అంతకుముందు 2006 నుంచి 2016 మధ్య జరిగిన 100 టెస్టుల దశలో భారత్ స్వదేశంలో 42 మ్యాచ్‌లు ఆడి 26 విజయాలు సాధించింది. గత రెండు 100 టెస్టుల దశలను కలిపి చూస్తే స్వదేశంలో భారత్ 92 మ్యాచ్‌ల్లో 61 విజయాలు సాధించింది. తొలి నాలుగు దశల్లో కలిపి 207 హోం టెస్టుల్లో సాధించిన 62 విజయాలకు ఇది దాదాపు సమానం. అంతేకాదు.. 2013 నుంచి 2024 మధ్య స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లను భారత్ గెలిచింది. స్వదేశీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీమిండియా ఎంతగా ఆధిపత్యం సాధించిందో ఈ రికార్డు స్పష్టం చేస్తుంది.
విదేశాల్లోనూ..
ఒకప్పుడు విదేశీ గడ్డపై భారత్ విజయాలు చాలా అరుదుగా ఉండేవి. అయితే గత కొంత కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత రెండు 100 టెస్టుల దశల్లో భారత్ విదేశాల్లో 107 మ్యాచ్‌లు ఆడి 37 విజయాలు సాధించింది. తొలి నాలుగు దశల్లో 193 విదేశీ మ్యాచ్‌ల్లో కేవలం 26 విజయాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవలి 100 టెస్టుల దశలో విదేశాల్లో భారత్ 49 మ్యాచ్‌లు ఆడి 21 గెలిచి, 22 మ్యాచ్‌ల్లో ఓడింది.

కొత్త శకం..
భారత టెస్టు క్రికెట్ ఎదుగుదలలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించింది. కోహ్లీ 68 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించి 40 విజయాలు అందించాడు. భారత్ చరిత్రలో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలిచారు. ఆయన కెప్టెన్సీలో వచ్చిన 40 విజయాల్లో 32 విజయాలు ఇటీవలి 100 టెస్టుల దశలోనే నమోదయ్యాయి. అందులో 12 విజయాలు విదేశీ గడ్డపై వచ్చాయి. భారత కెప్టెన్లలో విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలను సాధించిన నాయకుడిగానూ కోహ్లీ ప్రత్యేక గుర్తింపు పొందాడు.
బౌలర్ల ఆధిపత్యం..
భారత టెస్టు క్రికెట్‌లో మరో కీలక మార్పు బౌలింగ్ విభాగంలో కనిపించింది. తొలి రెండు 100 టెస్టుల దశల్లో స్పిన్నర్లు పేసర్ల కంటే దాదాపు రెండింతలు వికెట్లు తీశారు. ఆ తర్వాత ఈ తేడా క్రమంగా తగ్గింది. ఇటీవలి 100 టెస్టుల దశలో తొలిసారిగా పేసర్లు స్పిన్నర్ల కంటే ఎక్కువ వికెట్లు సాధించారు. భారత బౌలర్ల సగటు కూడా గణనీయంగా మెరుగుపడింది. ఈ దశలో బౌలర్ల సగటు 25.35గా ఉంది. అంతకుముందు దశలో ఇది 34.9కు దగ్గరగా ఉండేది. ఇందులో పేసర్లు 26 సగటుతో, స్పిన్నర్లు 24.62 సగటుతో బౌలింగ్ చేశారు. వికెట్ తీయడానికి పట్టే బంతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అంటే భారత బౌలింగ్ దళం గతంతో పోలిస్తే మరింత ప్రభావవంతంగా మారింది.

బ్యాటింగ్‌లోనూ మార్పులు..
బ్యాటర్ల సగటులు తొలి ఐదు 100-టెస్టుల దశల్లో క్రమంగా పెరిగాయి. అయితే ఇటీవలి 100 టెస్టుల దశలో కొంత తగ్గుదల కనిపించింది. ఈ సమయంలో భారత బ్యాటర్లు సగటున 33.21 పరుగులు సాధించారు. ఈ దశలో 1,000కు పైగా పరుగులు చేసిన 12 మంది భారత బ్యాటర్లలో కేవలం ఇద్దరే 45కు పైగా సగటు నమోదు చేశారు. అయితే బౌలింగ్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 50కి పైగా వికెట్లు తీసిన మొత్తం 9 మంది భారత బౌలర్లు 30 కంటే తక్కువ సగటును నమోదు చేశారు.
భారత్ నుంచి దిగ్గజ బ్యాటర్స్..
వివిధ 100 టెస్టుల దశల్లో భారత బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాళ్లు కూడా మారుతూ వచ్చారు. సచిన్ టెండూల్కర్ నాలుగో, ఐదో దశల్లో భారీగా పరుగులు సాధించగా.. రాహుల్ ద్రవిడ్ 1996-2006 మధ్య జరిగిన నాలుగో 100-టెస్టుల దశలో ఏకంగా 8,741 పరుగులు చేసి భారత్ తరఫున ఒక దశలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ దశలో ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవిడ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
మొత్తంగా 1932లో ప్రారంభమైన భారత టెస్టు ప్రయాణం.. తొలి 100 టెస్టులకు 35 ఏళ్లు పట్టిన దశ నుంచి, ప్రతి పదేళ్లకు దాదాపు 100 టెస్టులు ఆడే స్థాయికి చేరుకుంది. స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం, విదేశాల్లో మెరుగైన విజయాలు, పేస్ బౌలింగ్‌లో విప్లవం, కోహ్లీ వంటి విజయవంతమైన కెప్టెన్ల నాయకత్వం.. ఇవన్నీ కలిపి భారత్‌ను ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా నిలబెట్టాయి. ఇప్పుడు శ్రీలంకతో గాలేలో జరగబోయే 600వ టెస్టు భారత క్రికెట్ చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలవనుంది.




