అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి రేపటి (జూన్ 12)తో ఏడాది పూర్తవుతోంది. ఇప్పటికీ ఆ ప్రమాద తీవ్రత కళ్లల్లో మెదులుతూనే ఉంది. దాదాపు 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటన. ఈ ప్రమాదం తర్వాత వచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో పైలట్ తప్పిదం వల్ల జరిగిందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

తాజాగా పైలట్ల సంఘాలు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక మధ్యంతర నివేదిక విడుదల చేయడాన్ని కూడా వ్యతిరేకించారు. నేరాన్ని పైలట్‌పై నెట్టేయడం సరైంది కాదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్‌ఐపి) అధ్యక్షుడు కెప్టెన్ సిఎస్ రంధావా అన్నారు. ప్రమాదాలకు పైలట్లను బలిపశువులను చేయకూడదని హితవు పలికారు. కాక్‌పిట్‌లో నమోదైన కొన్ని సెకన్ల ఆడియో ఆధారంగా పైలట్లను ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. పైలట్లు కావాలనే ఇంజిన్లు ఆపేసినట్లుగా హడావుడిగా ఒక వర్గం అంతర్జాతీయ మీడియా కథనాలు రాసిందని ఆరోపించారు.
దర్యాప్తు అనేది కేవలం ఇంధన నియంత్రణ స్విచ్‌కే పరిమితం కాకూడదని.. విమానంలోని విద్యుత్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ వ్యవస్థలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. బోయింగ్ 787 విమానాల్లో గతంలో విద్యుత్ వ్యవస్థ, లిథియం బ్యాటరీలు, విద్యుత్ మంటలు, నీరు చేరడం, ఎలక్ట్రానిక్స్ విభాగంలో సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు. ప్రమాదం జరిగిన రోజున వియన్నా-ఢిల్లీ ఎయిరిండియాకు చెందిన మరో విమానంలో కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి.. ఎలక్ట్రానిక్ బేలో నీరు నిలిచిపోయిందని గుర్తుచేశారు. దర్యాప్తులో మరింత మంది పైలట్లు, ఇంజనీర్లు, విమాన భద్రతా నిపుణులను చేర్చాలని ఎఫ్‌ఐపీ డిమాండ్ చేసింది. ఈ విషయమై గత ఏడాది కాలంలో ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు 20కి పైగా లేఖలు పంపినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రంధావా తెలిపారు.
జూన్ 12, 2025న ప్రమాదం
ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే సమీపంలోని మెడికల్ హాస్టల్‌పై కూలిపోయింది. దీంతో ఒక్క ప్రయాణికుడు తప్ప మిగతా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. వీరితో పాటు 19 మంది మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలా 260 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన యావత్తు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేసింది. అయితే ప్రమాదం తర్వాత విమాన ప్రమాద దర్యాప్తు బోర్డు (AAIB) ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. పైలట్ నిర్లక్ష్యమే అన్నట్టుగా తేల్చింది. దీనిపై పైలట్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పటి వరకు తుది రిపోర్ట్ రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు.




