India Fertility Rate: భారత్.. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం. మన దేశ యువతలో ఉండే పౌరుషం, ధీరత్వం వేరు. ‘నాకు వంద మంది యువకులను ఇవ్వండి.. ఈ దేశ చరిత్రనే మారుస్తా’ అని స్వామి వివేకానంద అన్నారు. యువత మీద ఆయనకున్న అపారమైన నమ్మకంతో, ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను’ అని తరచూ చెప్పేవారు. అలాంటి పేరున్న మన దేశానికి ప్రస్తుతం ఓ భారీ ముప్పు పొంచి ఉంది. దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోంది. దీంతో భారత్ అత్యధిక యువత కలిగిన దేశం అనే కిరీటాన్ని చేజార్చుకునే ప్రమాదం ఉంది! ఇంతకీ ఏం జరిగింది? సంతానోత్పత్తి రేటు ఎందుకు తగ్గుతోంది. అనే పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విద్యావంతుల్లో క్షీణిస్తున్న సంతానోత్పత్తి రేటు..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు భారతదేశంలో సరికొత్త చర్చకు తెరలేపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్) వేగంగా పడిపోతోందంటూ ది ఎకనామిస్ట్ పత్రిక ప్రచురించిన కథనాన్ని మస్క్ ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకున్నారు. ముఖ్యంగా విద్యావంతుల్లో ఈ రేటు ఎప్పుడో పడిపోయిందని మస్క్ పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి 2025 నివేదిక ప్రకారం.. భారత్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ (TFR) ప్రస్తుతం 1.9 కి పడిపోయింది. అంటే సగటున ఓ భారతీయ మహిళ తన జీవితకాలంలో దాదాపు ఒక్కరికి జన్మనివ్వడానికే మొగ్గు చూపుతోంది. సాధారణంగా ఒక తరం స్థానంలో మరో తరం సమానంగా రావాలంటే ఈ రేటు 2.1 గా ఉండాలి, దీనినే రీప్లేస్‌మెంట్ లెవెల్ అంటారు. 1950లలో 5.7 గా ఉన్న ఈ రేటు, 2019-21 నాటికి 2.0 కి, ఇప్పుడు ఏకంగా 1.9 కి పడిపోవడం భారత్‌కు పొంచి ఉన్న ముప్పును సూచిస్తోంది. వాస్తవానికి.. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్.. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ భవిష్యత్తులో జపాన్, దక్షిణ కొరియా లాంటి వృద్ధాప్య జనాభా అధికంగా ఉన్న దేశాల జాబితాలో చేరుతుందేమో అనే టెన్షన్ పెరుగుతోంది.
పెరుగుతున్న ఖర్చులే కారణామా?
ఇక, భారత్‌లో పిల్లల సంఖ్య తగ్గడానికి పెరుగుతున్న ఖర్చులే కారణమని కొందరు ఆర్థికవేత్తలు బలంగా నమ్ముతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలపై గృహనిర్మాణం, నాణ్యమైన ప్రైవేట్ విద్య, వైద్యం, కోచింగ్ క్లాసులు, ఇతర వసతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పిల్లల్ని కేవలం పెంచడమే కాకుండా, వారికి ఉన్నతమైన జీవితాన్ని అందించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షలు ఈ ఖర్చులను మరింత పెంచుతున్నాయి. అయితే, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు షమిక రవి భిన్నమైన విశ్లేషణను వినిపించారు. సంతానోత్పత్తి తగ్గడానికి కేవలం డబ్బు లేదా ఆర్థిక ఖర్చులే కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలలో ప్రభుత్వాలు భారీగా ఆర్థిక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ అక్కడ జనాభా రేటు పెరగడం లేదని గుర్తుచేశారు. అసలు సమస్య ఆర్థిక స్థోమత కాదు, ప్రజల్లో “పిల్లలు కావాలి” అనే కోరిక (డిజైర్) తగ్గిపోవడమేనని ఆమె చెబుతున్నారు. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత 25 ఏళ్లుగానే ఈ రేటు రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే తక్కువగా ఉందని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని తెలిపారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, సమాజంలో వస్తున్న లోతైన సాంస్కృతిక మార్పులకు అద్దం పడుతోంది. ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే ఈ ఆలోచనా విధానాన్ని మార్చలేవని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రముఖ నోబెల్ గ్రహీత అమర్త్యాసేన్ చెప్పిందే నిజమైందా?
ఈ మార్పునకు మహిళల సాధికారత, మారుతున్న వారి ఆకాంక్షలు సైతం ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రముఖ నోబెల్ గ్రహీత అమర్త్యాసేన్ తన ‘డెవలప్‌మెంట్ యాజ్ ఫ్రీడమ్’ పుస్తకంలో చెప్పినట్లుగా, మహిళల అభివృద్ధికి, సంతానోత్పత్తి తగ్గుదలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. మహిళల్లో విద్యావంతుల సంఖ్య పెరగడం, వారు కెరీర్‌పై దృష్టి పెట్టడం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, తమ జీవితాలపై స్వంత నిర్ణయాలు తీసుకోగలగడం వంటివి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2025లో జర్నల్ ఆఫ్ పాపులేషన్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మహిళలకు మీడియా ఎక్స్‌పోజర్, ఆర్థిక స్వాతంత్ర్యం, ఆస్తి హక్కులు ఉన్నచోట సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. సమాజంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉన్నచోట మాత్రమే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
ఫిన్‌టెక్ నిపుణురాలు మోనికా జసుజా అభిప్రాయం ప్రకారం.. ఆధునిక విద్యావంతులు పిల్లల్ని కనడాన్ని ఒక బాధ్యతగా కాకుండా వ్యక్తిగత ఎంపికగా భావిస్తున్నారు. సమయం చాలా తక్కువగా ఉండటం, కెరీర్ ఒత్తిళ్లు పెరగడం వల్ల చాలా మంది ‘డింక్’ (డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్) సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా, పిల్లల్ని కనే విషయంలో మహిళలపై తీవ్రమైన “మదర్‌హుడ్ పెనాల్టీ” (తల్లిగా మారడం వల్ల కెరీర్‌లో వచ్చే నష్టాలు) ఉంటోంది. నేటికీ ఉద్యోగం చేసే మహిళలే ఇంటి పనిని, పిల్లల పెంపకాన్ని పూర్తిగా చూసుకోవాల్సి వస్తోంది. భాగస్వామి నుంచి లేదా కుటుంబం నుంచి సరైన మద్దతు లభించనప్పుడు, మహిళలు రెండో బిడ్డను కనడానికి లేదా అసలు పిల్లల్నే వద్దు అనుకోవడానికి వెనుకాడటం లేదు.
ప్రాంతాల వారీగా ఇలా..
భారతదేశంలో ఈ జనాభా తగ్గుదల అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. ఇందులో స్పష్టమైన ఉత్తర-దక్షిణ విభజన, పట్టణ-గ్రామీణ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికల్లో మెరుగ్గా ఉన్నాయి. అక్కడ విద్య, వైద్యం, మహిళా సాధికారత ఎక్కువగా ఉండటం వల్ల ఫెర్టిలిటీ రేట్ చాలా వేగంగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వంటి దక్షిణాది ముఖ్యమంత్రులు జనాభాను పెంచాలని, ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్ (2.9 TFR), ఉత్తరప్రదేశ్ (2.6), మధ్యప్రదేశ్ (2.4), రాజస్థాన్ (2.3) వంటి రాష్ట్రాలు ఇప్పటికీ రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే పైనే ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 1.5 కి పడిపోగా, ఢిల్లీలో అత్యల్పంగా 1.2, చండీగఢ్‌లో 1.4 గా నమోదైంది.
మరోవైపు.. ఈ పరిణామాల వల్ల భారత్‌కు ఇప్పుడే ప్రమాదమేమీ లేదని, జనాభా గరిష్ట స్థాయికి చేరిన తర్వాతే తగ్గుదల ప్రారంభమవుతుందని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. అయితే, భారతదేశంలో లైవ్ బర్త్స్ (పుట్టుకలు) గరిష్ట స్థాయి 2001 లోనే దాటిపోయిందని, కేవలం ఆయుర్దాయం పెరగడం వల్లే జనాభా ఇంకా పెరుగుతున్నట్లు కనిపిస్తోందని హెచ్చరించారు. లేదంటే 2030ల నాటికే జనాభా తగ్గుదల స్పష్టంగా తెలిసేదన్నారు. నిపుణుల అంచనా ప్రకారం 2050 నాటికి దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 20 శాతానికి (దాదాపు 30 కోట్లకు) చేరుకుంటుంది. దీనివల్ల దేశం సంపన్న దేశంగా మారకముందే వృద్ధాప్య దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇక, ఈ సవాలును అధిగమించడానికి జపాన్ తరహాలో వృద్ధులను సైతం ఉత్పాదక శ్రమలో భాగస్వామ్యం చేసే “సిల్వర్ డివిడెండ్” విధానాలను భారత్ ఇప్పటి నుంచే అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, భారతదేశంలో తగ్గుతున్న ఈ జననాల రేటుకు కేవలం ఒకే ఒక్క కారణం లేదు. పెరుగుతున్న జీవన వ్యయాలు, మారుతున్న సామాజిక ఆకాంక్షలు, మహిళల సాధికారత, కెరీర్ ప్రాధాన్యతలు అన్నీ కలిసి ఈ మార్పునకు కారణమవుతున్నాయి. ఇప్పటి నుంచే ఓ పరిష్కారం వెతకడం చాలా ముఖ్యం.




