Telangana Heatwave: తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలో తీవ్ర ఎండలు, వడగాలులు తీవ్ర విషాదాన్ని నింపాయి. వడదెబ్బ బారిన పడి జిల్లాలో నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందడం కలకలం సృష్టించింది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన రైతు మాశబోయిన రాజయ్య (60) వడదెబ్బతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే భూపాలపల్లి మండలం కమలాపూర్‌కు చెందిన తాపీ మేస్త్రి చిర్ర నాగరాజు (40) సైతం ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన గాదె అంజయ్య (48) వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వడగాలుల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధులు, రైతులు, కూలీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సన్ స్ట్రో క్ నుంచి రక్షణ పొందేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్ లు వాడితే మంచిది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవడం ఉత్తమం. ప్రతి గంటకు ఒకసారి నీరు తాగాలి. రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తప్పకుండా తాగాలి. నీటితో పాటు ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీరు తీసుకోవటం మంచిది. నూనె పదార్థాల వాడకం తగ్గించాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.. జూస్‌లు తాగుతుండాలి. శరీరం లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.చెమటను గ్రహించే, చల్లగా ఉండే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. వేసవిలో శీతల పానీయాలు అంత మంచిది కాదు. వాటికి బదులు కొబ్బరి బోండాం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరంలోని లవణాలు కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చు.




