Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) లో ముసలం ముంచుకొస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీలకు వ్యతిరేకంగా పలువురు నేతలు గొంతు విప్పుతున్నారు. పార్టీలోని కొందరు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ముగ్గురు అధికార ప్రతినిధుల్ని టీఎంసీ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి స్పష్టమైన సందేశాన్ని పంపింది.
టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా, గతంలో తాను బీజేపీని, సువేందు అధికారిని ఉద్దేశిస్తూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. పార్టీ ఒత్తిడి వల్లే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని తన ఎక్స్ హ్యాండిల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. తనకు రక్షణ, మద్దతు బీజేపీ నుంచి వచ్చిందని ఆయన ప్రశంసించారు. ఈ చర్యకు గానూ టీఎంసీ అతడిని క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని కోరింది. అయితే, దత్తా మాత్రం వీటిని పట్టించుకోలేదు.
Read Also: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
ఇక మాజీ క్రికెటర్ మనోజ్ తిరవారీ కూడా టీఎంసీపై విమర్శలు గుప్పించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక సమయంలో పార్టీ టికెట్ పొందడానికి ప్రతీ అభ్యర్థి నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. అయితే, తాను చెల్లించడానికి నిరాకరించినట్లు చెప్పారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే ఆరోపణలపై పార్టీ అధికార ప్రతినిధులైన కోహినూర్ మజుందార్, కార్తీక్ ఘోష్‌లను కూడా టీఎంసీ సస్పెండ్ చేసింది. అభిషేక్ బెనర్జీని కలవడానికి గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చేదని కోహినూర్ మజుందార్ అన్నారు.
పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి అభిషేక్ బెనర్జీ కారణమని మాల్దాకు చెందిన సీనియర్ టీఎంసీ నాయకుడు ఆరోపించారు. పార్టీ వ్యవహార శైలి కారణంగానే ఓడిపోయామని కృష్ణేందు నారాయణ చౌదరి విమర్శించారు. పాపియా ఘోష్ కూడా పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు.




